Goa Temple Stampede: గోవా లైరాయ్ ఆలయంలో తొక్కిసలాట ! ఏడుగురు భక్తులు మృతి !
గోవా లైరాయ్ ఆలయంలో తొక్కిసలాట ! ఏడుగురు భక్తులు మృతి !
Goa Temple Stampede : గోవాలోని శిర్గావ్‌మలో గల లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం జాతరను పురస్కరించుకొని లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా(Goa) నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే’ (దొండాచీ యాత్ర) ఆచారంలో భాగంగా ఆ కార్యక్రమంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది. దీనితో తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందగా… మరో 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గోవాలోని శిర్‌గావ్ ప్రాంతంలోని శ్రీ లరాయ్ దేవీ ఆలయంలో ప్రతీ ఏటా జాతర నిర్వహిస్తుంటారు. పార్వతీ దేవి అవతారంగా భావించే లైరాయ్ దేవిని పూజించి తరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ఏటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో దొండాచీ యాత్ర ప్రధాన ఆకర్షణ. ఇందులో భక్తులు కణకణలాడే బొగ్గులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక జాతరలో భాగంగా అమ్మవారిని భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. డప్పుల చప్పుడు, జయజయధ్వానాల మధ్య జరిగే ఈ ఊరేగింపులో పాల్గొని లరాయ్ మాత ఆశీస్సుల పొందేందుకు ఏటా వేల మంది ఇందులో పాల్గొంటారు.
దీనిలో భాగంగా శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారు జామున దొండాచీ యాత్రను నిర్వహిస్తుండగా… భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట(Goa Temple Stampede) జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Goa Temple Stampede – లైరాయ్ ఆలయం తొక్కిసలాట ప్రమాదంపై మోదీ ఆరా
లైరాయ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో(Goa Temple Stampede) గాయపడిన వారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఈ దుర్ఘటనపై ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. లైరాయ్ దేవి యాత్రలో తొక్కిసలాట విచారకరమని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తాను పరామర్శించానని, వారికి అన్ని రకాల సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. సహాయక చర్యలను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలిపారు. ప్రధాని మోదీ కూడా తనకు ఫోన్ చేశారని, ఈ క్లిష్ట సమయంలో పూర్తి సహాయసహకారాలు అందిస్తానని మాటిచ్చారని తెలిపారు. ఘటనపై ప్రధాని కార్యాలయం కూడా ఎక్స్ వేదికగా స్పందించింది. బాధిత కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారని చెప్పింది.
Also Read : Deputy CM Pawan Kalyan: భారతదేశానికి తలమానికం అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్