Gorantla Madhav : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కు 14 రోజుల రిమాండ్‌

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కు 14 రోజుల రిమాండ్‌

Gorantla Madhav : మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాధవ్‌ తో పాటు మిగతా ఐదుగురికి కూడా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాధవ్‌ ను తొలుత నల్లపాడు పీఎస్‌ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్‌ను ప్రత్యేక మొబైల్‌ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. మాధవ్‌ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ వాదనలు వినిపించారు. గోరంట్ల మాధవ్‌కు(Gorantla Madhav) రిమాండ్‌ తిరస్కరించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ప్రత్యేక మొబైల్‌ కోర్టు జడ్జి… మాధవ్‌కు ఏప్రిల్‌ 24 వరకు రిమాండ్‌ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు మాధవ్‌ సహా నిందితులందరినీ నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కోర్టుకు(Guntur Court) తీసుకొచ్చిన సమయంలో ఆయన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి మాధవ్‌ నిరాకరించారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gorantla Madhav – పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు – గుంటూరు ఎస్పీ

గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌… మాధవ్‌ అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘చుట్టుగుంట వద్ద పోలీసు వాహనాన్ని అనుచరులతో కలసి మాధవ్‌ అడ్డుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కిరణ్‌ పై మాధవ్‌ దాడికి పాల్పడ్డారు. గోరంట్లతోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద కూడా వారు దాడికి పాల్పడ్డారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఇది నేరపూరిత చర్య. మాధవ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశాం. మరో ఆరుగురిని అరెస్టు చేశాం’’అని తెలిపారు.

అసలేం జరిగిందంటే ?

వైఎస్‌ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను పోలీసులు వాహనంలో గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నారన్న సమాచారంతో మాధవ్‌ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసు వాహనాలకు దారివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. గుంటూరు చుట్టుగంట జంక్షన్‌ వద్దకు వచ్చాక తన కారు అడ్డు పెట్టి పక్కకు తీయలేదు. అంతే కాకుండా కిరణ్‌ కుమార్‌ పై దాడి చేసేందుకు మాధవ్‌ యత్నించాడు. ఈ క్రమంలోనే విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై పోలీసులు మాధవ్‌ను అరెస్టు చేసి నల్లపాడు పీఎస్‌కు తరలించారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

Also Read : Former Minister Jogi Ramesh: సీఐడీ విచారణకు హాజరైన జోగి రమేష్

Leave A Reply

Your Email Id will not be published!