GVMC: ముగిసిన జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికలు
ముగిసిన జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికలు
GVMC : విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఇప్పటికే కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నాయి. బుధవారం తాజాగా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాల్లో సైతం మెజార్టీ స్థానాలు కూటమిలోని పార్టీ అభ్యర్థులకే దక్కాయి. మొత్తం 10 స్థానాల్లో తొమ్మిది కూటమి… కేవలం ఒక్క స్థానం మాత్రం వైసీపీకి దక్కింది. అంటే 8 స్థానాల్లో టీడీపీ (TDP), ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అతి కష్టం మీద ఈ సీటును గెలుచుకుందని తెలుస్తోంది. ఇక ఈ జీవీఎంసీ (GVMC) ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం కూటమి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది.
GVMC Elections
బుధవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 92 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. అందుకే వైసీపీ ఘన విజయం సాధించిందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే… గతేడాది జరిగిన ఇవే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కూటమిలోని పార్టీలు గెలుచుకున్నాయి. కానీ ఈ సారి ఒక స్థానాన్ని కూటమి కోల్పోయింది. ఇక ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. అలాగే ఒక్క స్థానాన్ని ఎందుకు కోల్పోయామనే అంశంపై సైతం సమీక్షించు కుంటామని కూటమిలోని పార్టీల నేతలు పేర్కొన్నారు. దీనితో జీవీఎంసీలో (GVMC) కూటమి పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నట్లు అయింది.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ… తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.
కూటమి పాలనకు చెంప పెట్టు – కేకే రాజు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ… జీవీఎంసీ (GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్‌ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.
50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు.
Also Read : Visakhapatnam: మరో వివాదంలో ‘విశాఖ సెంట్రల్ జైలు’ ! వైరల్ గా మారిన ఖైదీల లేఖ !
