Hanuma Vihari: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి భేటీ !

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి భేటీ !

Hanuma Vihari: టీమిండియా క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి… ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన హనుమ విహారి… అక్కడ నుండి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో గత ప్రభుత్వంలో తాను ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్ళు, అవమానాలను పవన్ కళ్యాణ్ కు వివరించారు. అయితే ఆ సమయంలో తనకు భరోసాగా నిలిచినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఈ సందర్భంగా హనుమ విహారి ధన్యవాదాలు తెలిపారు.

Hanuma Vihari Meet

అంతకు ముందు నారా లోకేశ్ ను కలిసిన అనంతరం హనుమ విహారి(Hanuma Vihari) మీడియాతో మాట్లాడుతూ… ‘వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానాలను లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లాను. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)తో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేశ్‌ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్‌ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో జట్టును ఆరుసార్లు సెమీస్‌కు తీసుకెళ్లాను. గత ప్రభుత్వం నా ప్రతిభను తొక్కేసింది. తాము చెప్పిన వారిని జట్టులో చేర్చుకోలేదని నాటి ఏసీఏ పెద్దలు కుట్ర పన్నారు. నేను ఉంటే వాళ్లకు ఇబ్బందని భావించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానంతో ఆంధ్రా జట్టును వదిలేయడానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కూడా తీసుకున్నాను. నేను ఇబ్బందులు పడినప్పుడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ అండగా నిలిచారు’ అని తెలిపారు.

Also Read : KCR: విద్యుత్ న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటుపై హైకోర్టుకు కేసీఆర్ !

Leave A Reply

Your Email Id will not be published!