Harish Rao : అధ్వానంగా ఉన్న ఐటీఐ కళాశాలల పరిస్థితి ప్రభుత్వానికి పట్టదు

వాటర్‌ ట్యాంక్స్ అన్నీ మురికితో పాకురు పట్టి ఉంటున్నాయని హరీష్ రావు తెలిపారు...

Harish Rao : రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తెలిపారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లేక, టాయిలెట్స్ లేక, అవసరమైన సిబ్బంది లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారన్నారని హరీష్ రావు తెలిపారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర మెషీన్లు పనిచేయడం లేదన్నారు. దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారన్నారు. కొన్ని చోట్ల ఐటిఐ తరగతుల్లోకి వాన నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని హరీష్ రావు అన్నారు.

Harish Rao Comment

కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యం అయ్యాయన్నారు. అత్యధిక ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. స్నానాల గదులకు డోర్లు కూడా లేని పరిస్థితి చాలా పాఠశాలల్లో ఉందన్నారు. సరిపడా బాత్‌రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదని విమర్శించారు. పెడుతున్న భోజనం కూడా నాణ్యంగా ఉండటం లేదన్నారు. దిక్కు లేక కారం అన్నంతో కడుపులు నింపుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

వాటర్‌ ట్యాంక్స్ అన్నీ మురికితో పాకురు పట్టి ఉంటున్నాయని హరీష్ రావు(Harish Rao) తెలిపారు. ఆ నీటినే విద్యార్థులు స్నానానికి, ఇతర అవసరాలకు వాడుతుండటంతో చర్మవ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారని ప్రశ్నించారు. గురుకులాల్లో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బంగారు మయం అవుతుందని తల్లిదండ్రులు ఎలా నమ్ముతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిగజారుతుండటం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అవసరమైన అన్ని సౌకర్యాలు వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.

Also Read : Kolkata Doctor Case : కోల్‌కతా డాక్టర్ మృతిలో సంచలన విషయాలు

Leave A Reply

Your Email Id will not be published!