Harish Rao: విర్రవీగితే మీకూ ఏపీ అధికారులకు పట్టిన గతే పడుతుంది – మాజీ మంత్రి హరీశ్‌ రావు

విర్రవీగితే మీకూ ఏపీ అధికారులకు పట్టిన గతే పడుతుంది - మాజీ మంత్రి హరీశ్‌ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్‌శాఖలో జరిగిన పరిణామాలను మాజీ మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు… ప్రస్తుతం సస్పెండ్‌ అవుతున్నారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంది. మాపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ తరహా పరిణామాలు ఎదుర్కోవటానికి పోలీసులు సిద్ధంగా ఉండాలంటూ మాజీ మంత్రి హెచ్చరించారు. పోలీసులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని హితవుపలికారు. బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. కొందరు పోలీసు అధికారాలు తీరు మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో గుండాయిజం పెరిగిపోయిందన్నారు. అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. తొమ్మిది నెలల కాలంలో 2 వేల అత్యాచారాలు జరిగాయన్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటి మీదకు వెళ్ళి దాడి చేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో పంటపొలాలు ఎండిపోతున్నాయని హరీశ్‌రావు అన్నారు. ‘‘కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నా.. పొలాలు ఎండుతున్నాయి. సెప్టెంబర్‌ 1న పాలేరు జలాశయానికి 100 మీటర్ల దిగువన కాలువకు గండి పడింది. ఇప్పటికి 22 రోజులవుతున్నా పూడ్చలేదు. సాగర్‌ నిండుకుండలా ఉన్నా ఆయకట్టు రైతులకు నీరందడం లేదు. గత ఏడాది ప్రకృతి కరవు తెస్తే.. ఇప్పుడు కాంగ్రెస్‌ కరవు తెచ్చింది’’ అని హరీశ్‌రావు విమర్శించారు.

Leave A Reply

Your Email Id will not be published!