Haryana Elections : కాంగ్రెస్ కు హర్యానాలో మరో కొత్త తలనొప్పి..సీఎం రేసులో నేనంటే నేనంటున్న నేతలు
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరడంపై సెల్జా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ....
Haryana Elections : హర్యానాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రస్తుతం హర్యానా(Haryana) రాజకీయం మొత్తం కాంగ్రెస్ నాయకురాలు కుమారి సెల్జా చుట్టూ తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉండటంతో రాజకీయాలు వేడెక్కాయి. తాను పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు అంగీకరించిన ఆమె పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టత ఇచ్చారు. బీఎస్పీ, బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించారు. అదే సమయంలో తాను సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు.
దీంతో ఇప్పటికే సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత భూపేంద్ర సింగ్ హుడాకు ఆమె షాక్ ఇచ్చినట్లైంది. హర్యానాలో అధికారంలోకి వస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్(Congress) అంతర్గత విబేధాలతో కొంత ఇబ్బందిపడుతున్నట్లు నాయకుల వైఖరి చూస్తుంటే అర్థమవుతోంది. సెల్జా సూచించన అభ్యర్థులకు టికెట్లు నిరాకరించడంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సిర్సా ఎంపీగా ఉన్న కుమారి సెల్జా సెప్టెంబర్ 12 నుంచి పూర్తిగా సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్(Congress) ఎన్నికల ప్రచారంలో ఆమె యాక్టివ్‌గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ ఎక్కువుగా కనిపించడంలేదు. ఈక్రమంలో పార్టీ మార్పుపై సెల్జా స్పందించారు.
Haryana Elections Update
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరడంపై సెల్జా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతుంటాయని.. అవ్వన్నీ పార్టీ అంతర్గత విషయాలుగా చూడాల్సి ఉంటుందన్నారు. తన ప్రాణం పోయే వరకు కాంగ్రెస్‌ను వీడబోనని స్పష్టం చేశారు. హర్యానాలో బీజేపీ పతనమైందని, జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీ బలహీనపడుతుందన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోబ బీజేపీలో చేరేదిలేదని సెల్జా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్(Congress) పార్టీలో తాను అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆ విషయాలను బహిరంగంగా పంచుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. ప్రజల అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకెళ్తోందని కుమారి సెల్జా చెప్పారు.
హర్యానా ప్రజలు కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతున్నారని తెలిపారు. హర్యానా(Haryana)లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని దేశం మొత్తం చెబుతోందని.. ఇందులో తన పాత్ర కొంతమేర ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల సహకారం అంతకంటే ఎక్కువుగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటంపై సెల్జా స్పందిస్తూ గతంలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, ప్రస్తుతం కూడా ప్రచారానికి వెళ్తానన్నారు. పార్టీలో అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉంటాయని.. వాటిని బహిరంగ వేదికలపై చెప్పడం సరికాదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో సెల్జా సిఫార్సు చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత లేదన్న అంశంపై ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కొందరు అభ్యర్థులను సిఫార్సు చేస్తున్నారని.. చివరికి అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. ఎవరిని అదృష్టం వరిస్తుందో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. తాను ఉక్లానా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నట్లు తెలిపారు. ఉక్లానా తన స్వగ్రామమని.. అయినప్పటికీ టికెట్ దక్కలేదన్నారు. ప్రతిచోట మంచి అభ్యర్థులు ఉన్నారని, అటువంటి పరిస్థితుల్లో ఆశించిన అందరికీ టికెట్లు దక్కలేదని సెల్జా తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే హర్యానా సీఎం ఎవరనే దానిపై సెల్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని పార్టీలో ఎవరైనా ఆశించవచ్చని, పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందన్నారు.
పదవుల కోసం తాను ఎప్పుడూ ఆశించలేదని, పదవులు దక్కలేదని నిరాశపడలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని సెల్జా తెలిపారు. రాజకీయ నాయకుడిగా తాను కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని మనసులో మాటను బయటపెట్టారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ఏ నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్‌లో సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సీఎం పీఠంపై తన ఆసక్తిని బహిరంగంగా చెప్పడంతో సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత భూపేంద్ర సింగ్ హుడాలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుత దశలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎవరిని ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : Minister Anam : తిరుమల లడ్డూ కల్తీపై మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ఆనం