Heavy Rains Telangana : జోరు వాన తడిసి ముద్దైన తెలంగాణ
అంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
Heavy Rains Telangana : ఎడ తెరిపి లేకుండా మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కంటే ఈసారి తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. కుండ పోత వర్షంతో భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు(Heavy Rains Telangana) తడిసి ముద్దయ్యాయి.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో 21.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 21.03 , నెల్లి కుదురులో 15.68 సెంటీమీటర్ల వాన కురిసింది.
జూలై 22 నాటికి ఏకంగా 5850 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం విస్తు పోయేలా చేసింది. 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
శని, ఆదివారాలలో అంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇందులో భాగంగా ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ , జనగామ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది.
వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండాయి. నదుల్లోనూ గణనీయంగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే భద్రాచలం మునిగి పోయే స్థితికి చేరుకున్న తరుణంలో మరోసారి వర్షం తాకిడికి జనం విల విలలాడుతున్నారు.
కొత్తగూడెం, ములకలపల్లి, గుండాల, తదితర ప్రాంతాల్లో వాగుల్లో వరద పోటెత్తింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే దారిలో బాచారం వంతెన వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాక పోకలు నిలిపి వేశారు.
Also Read : భారీ వర్షం అతలాకుతలం