Himachal Deputy CM: హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం, డీజీపీలకు త్రుటిలో తప్పిన ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం, డీజీపీలకు త్రుటిలో తప్పిన ప్రమాదం
Himachal Deputy CM : హిమాచల్ ప్రదేశ్ లో శిమ్లా లో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అలయన్స్ ఎయిర్ ఫ్లయిట్ నెంబర్ 91821 జుబ్బర్‌హట్టి ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై ల్యాండవ్వకుండా ముందుకు దూసుకెళ్లింది. పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో చిట్టచివరి అంచున ఉన్న స్టడ్స్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. దాదాపు అరగంట తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించారు. ఈ విమానంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేశ్ అగ్నిహోత్రీ(Mukesh Agnihotri), రాష్ట్ర డీజీపీ అతుల్ వర్మ సహా 44 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Himachal Deputy CM Escaped from Flight Accident
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. అన్ని తనిఖీల తర్వాతే ఢిల్లీలో విమానం టేకాఫ్ తీసుకుందని చెప్పారు. సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో కొండప్రాంతంలో ఉన్న జుబ్బర్‌హట్టి ఎయిర్ స్ట్రిప్ పొడవు 1,230 మీటర్లు మాత్రమే. పైపెచ్చు ఏటవాలుగా ఉంటుందని చెబుతున్నారు. కాగా, తాజా ఘటనకు దారితీసిన కారణాలపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. విమానంలో సాంకేతిక లోపాలపై ఇంజనీరింగ్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
‘‘ఈ ఉదయం మేము విమానంలో శిమ్లా చేరుకొన్నాం. ల్యాండింగ్ సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. సాంకేతిక అంశాలు నాకు తెలియదు. కానీ, విమానం ఎక్కడ దిగాలో అక్కడ ల్యాండ్ కాలేదు… ఆగాల్సిన చోట ఆగలేదు. రన్ వే చివరికి దూసుకెళ్లి ఆగింది. వేగాన్ని తగ్గించేందుకు శక్తిమంతమైన బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో 25 నిమిషాలపాటు విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం అగ్నిహోత్రి తెలిపారు.
Also Read : AP Government: అంతర్జాతీయ స్థాయి వర్సిటీ ఏర్పాటుకు జీఎన్‌యూతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం