HYDRA: ఆక్రమిత కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక !
ఆక్రమిత కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక !
HYDRA: రాష్ట్ర రాజధాని తెలంగాణాలో సంచలనంగా మారిన హైడ్రా … అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలో జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా(HYDRA) వెల్లడించింది. తద్వారా కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా(HYDRA) రిపోర్ట్‌లో వెల్లడించింది. మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్ పేట్ లో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసినట్లు హైడ్రా పేర్కొంది.
HYDRA Updates
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్టు హైడ్రా(HYDRA) ప్రభుత్వానికి నివేదించింది. చింతల్ చెరువులో స్థానిక భారాస నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే నందగిరి హిల్స్‌కు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని 18 గుంటల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్‌లోని బుమురౌఖ్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదంతస్తుల భవనాలు, ఒకటి రెండంతస్తుల భవనంతోపాటు మరో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపింది.
గండిపేట ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రోకబడ్డి యజమాని అనుపమ ఆక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు వివరించింది. ఖానాపూర్, చిలుకూరు వద్ద గండిపేట ఎఫ్‌టీఎల్‌లోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించిన రెండు నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా(HYDRA) తెలిపింది. ఇక్కడ 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా పేర్కొంది.
ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మన్సూరాబాద్‌లో 2 గుంటలు, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలా నగర్‌లో ఎకరా 4 గుంటలు, ఫిల్మ్ నగర్‌లోని బీజేఆర్ నగర్‌లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ ను కూల్చి వేసి 5 ఎకరాలు, గాజులరామారం మహాదేవపురం వద్ద ఒక గుంట, గాజుల రామారావు భూదేవిహిల్స్‌లో ఎకరం ఒక గుంట, అమీర్‌పేటలో గుంట, చందానగర్ ఈర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం ఒకటి, నాలుగు అంతస్తుల భవనం రెండింటిని కూల్చివేసి 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. బాచుపల్లి ఎర్రకుంటలో 29 గుంటలు, బోడుప్పల్ రెవెన్యూ భూమిలో 3 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
హైదరాబాద్‌లో ‘హైడ్రా(HYDRA)’ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ తరహా వ్యవస్థలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. అవకాశమున్న చోటఆక్రమణలను తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా కాపాడేలా చర్యలు చేపట్టనున్నట్టు వివరించాయి.
ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడ చెరువుల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలంటూ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ గౌతం తదితరులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోని పరిస్థితిపై సమీక్ష కూడా జరిపినట్టు తెలిసింది. త్వరలోనే ఇతర నగరాల్లో ‘హైడ్రా’తరహా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read : Omar Abdullah: ఎన్నికల్లో పోటీ అంశంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా యూటర్న్ !