Shyla Talluri : అవగాహన లోపం అనారోగ్యానికి కారణం
మార్పు రావాలంటున్న శైలా తాళ్లూరి
Shyla Talluri : సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు మహిళలు. అనాది నుంచి నేటి దాకా తరాలు మారినా దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతున్నా ఇంకా బాలికలు, యువతులు, మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా చిన్నారులపై ఇటీవల లైంగిక దాడులు కొనసాగుతున్నాయి.
వీటన్నింటి కంటే సామాజిక వివక్ష అనేది రోజు రోజుకు పెరుగుతోంది. దీనికంటే ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రుతుస్రావం సమస్య. ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తోంది.
దీనిపై ఎక్కువగా అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు తెలుగు వారైన శైలా తాళ్లూరి. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. పూర్వ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దానికి డైరెక్టర్ గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు.
వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రధానంగా విద్య, ఆరోగ్యం, భద్రత ఉండాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇందుకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు.
అయితే ప్రతి నెలా నెలా వచ్చే నెలసరి గురించి ఇప్పటికీ దేశంలో 70 శాతానికి పైగా అవగాహన ఉండడం లేదంటున్నారు శైలా తాళ్లూరి. ప్రధానంగా
ఆయా స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీలు, ఇతర ప్రైవేట్ సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు, యువతులు, విద్యార్థినులకు అవగాహన ఉండక పోవడాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. దీనిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడమే కాదు అందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించారు.
ఇందులో భాగంగా ఔత్సాహికులు, సామాజిక బాధ్యత కలిగిన సంస్థలు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి శిక్షణ, అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు శైలా తాళ్లూరి(Shyla Talluri).
శానిటరీ ప్యాడ్స్ ఏవి తీసుకోవాలి, ఎలాంటివి వాడాలి. ఎలా ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్యూర్ ద్వారా వేలాది మంది విద్యార్థులు అవగాహన పొందారు. మరికొందరు శిక్షణ తీసుకుంటున్నారు.
పిల్లల నుంచి పెద్దవాళ్లు అయ్యేంత వరకు జాగ్రత్తగా గమనిస్తూ , వారికి సరైన సమయంలో సూచనలు ఇస్తూ..ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని అంటున్నారు శైలా తాళ్లూరి.
రుతుక్రమం సర్వ సాధారణం. కానీ దానిని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో రోగాలకు దారి తీస్తుందన్న విషయం కూడా తెలియ చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తెలంగాణ, ఏపీలోని ప్రభుత్వ బడులు, హాస్టళ్లలో చదువుతున్న నిరుపేద పిల్లలకు తక్కువ ఖర్చుతో కూడిన బయో డిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్ లు తయారు చేయడంపై ఫోకస్ పెట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో అవగాహన కల్పించడం అనే దానిని ఓ యజ్ఞంలా చేస్తున్నారు శైలా తాళ్లూరి. ఇప్పటికే వర్క్ షాప్ లు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలను చేపడుతూ బాలికలు, యువతులకు అండగా నిలుస్తోంది ప్యూర్.
రుతుక్రమ పరిశుభ్రతపై మహిళలకు ఎంత బాధ్యత ఉంటుందో పురుషులకు కూడా అంతే బాధ్యత ఉంటుందన్నారు శైలా తాళ్లూరి.
నెలసరిలో వచ్చే ఇబ్బందులను తట్టుకోలేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్యూర్ వారికి భరోసా కల్పించేందుకు నడుం బిగించిందని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో పేరెంట్స్ తో పాటు యూత్ క్లబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోందని వెల్లడించారు ప్యూర్ సిఇఓ శైలా తాళ్లూరి.
Also Read : ‘దీపా’ కథా ప్రస్థానం విజయానికి సోపానం