India-Canada : కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా పై భగ్గుమన్న భారత్
దౌత్య సిబ్బందిని బహిష్కరించినప్పటికి కెనడా సర్కార్ తీరు మారడంలేదు...
India : కెనడా కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్తాన్ కంటే దిగజారి వ్యవహరిస్తోంది. తమ దేశంలో ఖలిస్తాన్‌వాదులపై దాడుల వెనుక అమిత్‌షా హస్తముందని కొత్త నాటకం మొదలుపెట్టింది. దీనిపై విదేశాంగశాఖ మండిపడింది. కెనడా దౌత్య సిబ్బందిని పిలిచి విదేశాంగశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)పై కెనడా(Canada) ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కెనడియన్ హైకమిషన్ ప్రతినిధిని పిలిపించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శనివారం తెలిపారు.
India-Canada Issues..
దౌత్య సిబ్బందిని బహిష్కరించినప్పటికి కెనడా సర్కార్ తీరు మారడంలేదు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు తొత్తుగా మారిన ట్రూడో సర్కార్ భారత్‌పై కొత్త కుట్రలకు తెరతీస్తోంది. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah)ను కెనడా ప్రభుత్వం టార్గెట్ చేయడం సంచలనం రేపుతోంది. కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులపై దాడుల వెనుక అమిత్‌షా కుట్ర ఉందంటూ అమెరికా మీడియాకు కెనడా ప్రభుత్వం లీకులు ఇవ్వడంపై విదేశాంగశాఖ భగ్గుమంది. కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకున్న ప్రచారం వెనుక అమిత్ షా హస్తం ఉందని ఆరోపిస్తూ కెనడియన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ నథాలీ డ్రౌయిన్, కెనడియన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ సభ్యుడు డేవిడ్ మారిసన్ లీక్ అయిన వాషింగ్టన్ పోస్ట్ ధృవీకరించారు.
ట్రూడో సర్కార్ అమెరికా పత్రిక వాషింగ్టన్‌పోస్ట్‌కు అమిత్‌షాకు వ్యతిరేకంగా లీకులు ఇచ్చింది. సాక్ష్యాలంటూ కట్టుకథలు రాసేలా కుట్ర చేసింది. దీనిపై భారత సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమిత్ షాపై అనుచిత , నిరాధార వ్యాఖ్యలు చేశారని కెనడా హైకమిషనర్‌ను పిలిచిన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది విదేశాంగశాఖ. కెనడా ప్రభుత్వం ఎప్పటినుంచో ఇలాంటి కుట్రలకు తెరతీసిందన్నారు విదేశాంగశాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్.
మోరిసన్ చేసిన అసంబద్ధమైన, నిరాధారమైన సూచనలను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని జైస్వాల్ స్పష్టం చేశారు. కెనడాకు చెందిన ఉన్నతాధికారులు అంతర్జాతీయ మీడియాకు నిరాధారమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వెల్లడి కావడం భారత్‌ను పరువు తీయడానికి చేస్తున్న ప్రయత్న అన్నారు. ఇతర దేశాలను ప్రభావితం చేయడానికి ఉద్దేశపూర్వక వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర పరిణామాలను కలిగిస్తాయన్నారు.
అట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధారణమైన ఆరోపణలు చేశారు. మోరిసన్ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఆ ఆరోపణలు ఆందోళనకరమని, దీనిపై తాము కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. ఖలిస్థాన్ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇప్పటికే చాలా దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
Also Read : CM Chandrababu : రుషికొండ ప్యాలెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం