SK Hasina : బంగ్లాదేశ్ ప్రధాని హసీనా కి భారత్ ప్రత్యేక సెక్యూరిటీ
హసీనా విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని డిసైడ్ అయ్యాయి...
SK Hasina : బంగ్లాదేశ్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని పదవికి హసీనా సోమవారం రాజీనామా చేశారు. అనంతరం ఇక అక్కడే ఉండటం ఏమాత్రం క్షేమం కాదని.. ఆమె బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ శివార్లలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగారు. బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా చిక్కుల్లో పడిన ఆ దేశ ప్రధాని.. లండన్ వెళ్లాలనే ప్రణాళికలో భాగంగా భారత్‌కు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన C130J సైనిక రవాణా విమానంలో సోమవారం సాయంత్రం ఘజియాబాద్‌లోని హిండన్ వద్ద దిగారు. మరోవైపు షేక్ హసీనా(SK Hasina) భారత్‌కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి.
SK Hasina Bangladesh PM
హసీనా విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని డిసైడ్ అయ్యాయి. షేక్ హసీనా(SK Hasina) ఆశ్రయం కోరుతూ భారతదేశం వైపు వస్తున్నారన్న విషయాన్ని భారత భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. దీంతో ఆ విమానానికి రక్షణ కల్పించేందుకు భారత వైమానిక దళానికి చెందిన రాడార్లు గగనతలాన్ని పూర్తిగా పర్యవేక్షించాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐఏఎఫ్ రాడార్‌లు భారతదేశం వైపు వస్తున్న హసీనా విమానాన్ని గుర్తించాయి. ఆ వెంటనే భారత గగనతలంలోకి బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ విమానాలను అధికారులు అనుమతించారు. హసీనా రక్షణ కోసం ఐఏఎఫ్ రెండు రాఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బిహార్, ఝార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి.
హసీనా విమానం భారత్‌కు వస్తున్న తరుణంలో ఐఏఎఫ్, ఆర్మీ చీఫ్‌లు వీఆర్ చౌదరి, జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. అదే సమయంలో భద్రతాదళాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు నిఘా విభాగాధిపతులు, జనరల్ ద్వివేది, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ ఫిలిప్ మాథ్యూ కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హసీనా విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీనియర్ అధికారులతో కలిసి ఆమెకు ఆహ్వానం పలికారు. భారత అధికారులతో సమావేశం అనంతరం హసీనాను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. ఆమె ఇక్కడి నుంచి యూకేకి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Also Read : wayanad: రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది.