Indian Army: కశ్మీర్ లో కొనసాగుతోన్న ఉగ్రవేట ! 100 నివాసాల్లో పోలీసుల సోదాలు !
కశ్మీర్ లో కొనసాగుతోన్న ఉగ్రవేట ! 100 నివాసాల్లో పోలీసుల సోదాలు !
Indian Army : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముష్కరుల కోసం జమ్మూకశ్మీర్‌లో(Jammu Kashmir) వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పహల్గాం దాడి అనంతరం ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు. పహల్గాం ఘటన అనంతరం జమ్మూకశ్మీర్ లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. కాగా ఇప్పటివరకు 100కు పైగా ఉగ్రవాదుల అనుచరులు, అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
‘‘ఉగ్రవాదులకు మద్దతిచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసేవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే 100కు పైగా ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడిలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాల్సిందే’’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్(Jammu Kashmir) లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, సాక్షుల సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులకు పరికరాలను సమకూర్చిన కేసులో నిందితుడు అమిర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 2021లోనే ఎన్‌ఐఏ అతడిని అరెస్ట్ చేసింది.
Indian Army – భారత్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు ! భారత జవాను మృతి !
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మెరుపు దాడుల తర్వాత నుంచి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. గురువారం కూడా దాయాది సైన్యం కవ్వింపులు కొనసాగాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్ కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. దీనితో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఇదిలాఉండగా.. బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతి చెందినట్లు తెలుస్తోంది. పాక్ షెల్లింగ్ లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగాయి. ఈ ప్రాంతాల్లో 13 మంది భారత పౌరులు మృతిచెందగా… 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు చిన్నారులున్నారు. పహల్గాం దాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.
Also Read : Pawan Kalyan: “ఆపరేషన్ సిందూర్” పాకిస్తాన్ కు ఒక గుణపాఠం – పవన్ కళ్యాణ్
