Israel : ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ప్రాంతంలో ‘హిజ్బుల్లా’ దాడికి 11 మంది పిల్లలు మృతి
ఇది ఒక ఉగ్రవాద సంస్థ అని అభివర్ణించారు...
Israel : ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతమైన గోలన్ హైట్స్ ప్రాంతంలో రాకెట్ దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత చెందారు. హిజ్బుల్లా ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ దాడికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెజ్బుల్లాను హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ బాధాకరమైన దాడిపై ఇజ్రాయెల్(Israel) మౌనంగా ఉండదని, దీనికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందన్నారు. బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కానీ గోలన్ హైట్స్‌పై దాడి తర్వాత, ఆయన పర్యటనను మధ్యలోనే వదిలి ఇజ్రాయెల్‌కు తిరిగి వస్తున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనను హిజ్బుల్లా ఖండించింది.
Israel Attack
ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో ఈ దాడి హిజ్బుల్లా అసలైన తీరు బయటపడిందన్నారు. ఇది ఒక ఉగ్రవాద సంస్థ అని అభివర్ణించారు. శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ ఆడుతున్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేశారు. అక్టోబరు 7 తర్వాత గోలన్ హైట్స్‌లో జరిగిన అత్యంత క్రూరమైన దాడిగా హగారీ దీనిని అభివర్ణించారు. 2024 ఒలింపిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు పోటీపడుతుండగా, హిజ్బుల్లా ఇజ్రాయెల్ తర్వాతి తరం అథ్లెట్లను చంపేస్తోందని ఇజ్రాయెల్(Israel) డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది.
గోలన్ హైట్స్ సిరియా సరిహద్దులో ఉన్న పర్వత ప్రాంతం. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా వరకు గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1981లో గోలన్ హైట్స్‌ను తన సరిహద్దులో కలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఆక్రమణ అంతర్జాతీయంగా గుర్తించబడలేదు. సిరియా గోలన్ హైట్స్‌ను క్లెయిమ్ చేస్తోంది. గోలన్ హైట్స్ ప్రాంతం చాలా కాలంగా ప్రశాంతంగా ఉంది. గోలన్ హైట్స్ ప్రాంతం నీటి వనరులు, సహజంగా సారవంతమైన నేలతో సమృద్ధిగా ఉంటుంది. అందుకే సిరియా, ఇజ్రాయెల్ రెండూ ఈ ప్రాంతాన్ని తమకు కావాలని కోరుతున్నారు. గోలన్‌లో, సిరియా, ఇజ్రాయెల్ పౌరులు తమ ఆక్రమిత ప్రాంతాలలో నివసిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంలోని ఫుట్‌బాల్ మైదానంలో రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది ఇజ్రాయెల్ యువకులు, మైదానంలో ఆడుకుంటున్న పిల్లలు మరణించారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా గ్రూపులోని ముగ్గురు సభ్యులు మరణించిన కొన్ని గంటల తర్వాత రాకెట్ దాడి జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ తన ఆక్రమిత సిరియన్ గోలన్‌లో ఘోరమైన దాడి వెనుక హిజ్బుల్లా హస్తం ఉందని పేర్కొంది.
Also Read : Rains in AP : ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు