Jagdeep Dhankhar: భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి !
భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి !
Jagdeep Dhankhar: పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని… తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్(Jagdeep Dhankhar) సూచించారు. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ యూనిట్‌ను తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడి టీకాల తయారీ విధానాన్ని ఆయన తెలుసుకున్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనటంలో భారత్ బయోటెక్ క్రియాశీలక పాత్ర పోషించిందని ఉప రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు.
కొత్త టీకాలను కనుగొనటానికి తాము కట్టుబడి ఉన్నట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల ఆయనకు వివరించారు. ఈ విభాగంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే 400లకు పైగా పేటెంట్లు సాధించామని వెల్లడించారు. భారత్ బయోటెక్ పాతికేళ్ల కృషిని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల వివరిస్తూ.. సమీప భవిష్యత్తులో ఎన్నో కొత్త టీకాలు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మలేరియా, కలరా, టీబీ, గన్యా తదితర వ్యాధులకు టీకాలు అందిస్తామని పేర్కొన్నారు.
Jagdeep Dhankhar- ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ అన్నారు. శుక్రవారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వినూత్న పాఠ్యాంశాలు అభివృద్ధి చేయడానికి పరిశోధనలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విలువైన ప్రాచీన రాత ప్రతులను సంరక్షించడంలో డిజిటల్ సాంకేతిక వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి, విశ్రాంత ఐఏఎస్ ఎన్.గోపాలస్వామి, ఉపకులపతి జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఐసర్ సంచాలకులు శాంతన్ భట్టాచార్య, ఉప రాష్ట్రపతి సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ పాల్గొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Also Read : Maoist: వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం !