Jammu Kashmir : కాంగ్రెస్ పై కీలక నిర్ణయం తీసుకున్న ‘ఒమర్ అబ్దుల్లా’ సర్కార్

అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు...

Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాబోదని, బయటి నుంచి మాత్రం మద్దతు ఇస్తుందని ఇవాళ (బుధవారం) ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ను ప్రభుత్వంలో భాగం చేయాలని జమ్మూకశ్మీర్(Jammu Kashmir) కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని కోరినప్పటికీ ఢిల్లీ పెద్దలు అందుకు నిరాకరించారు. అయితే ఆ రాష్ట్రంలో పార్టీ నేతల పనితీరుపై హైకమాండ్ అసంతృప్తిగా ఉందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు నూతనంగా కొలువుదీరే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒమర్ అబ్దులా సానుకూలంగా ఉన్నప్పటికీ అధిష్ఠానం ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. పదవులకు కాకుండా జమ్మూకశ్మీర్‌లో పార్టీ బలోపేతానికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి కృషి చేయాలని స్థానిక నేతలను ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Jammu Kashmir Updates..

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. మెుత్తం 90సీట్లలో ఎన్‌సీ 42 స్థానాల్లో విజయం సాధించగా మిత్రపక్షం కాంగ్రెస్‌ 6 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఆప్‌ ఎమ్మెల్యే ఒకరు ఒమర్‌ ప్రభుత్వానికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇవాళ (అక్టోబర్ 16) ఉదయం 11:30 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(SKICC)లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరి చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా, కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దఎత్తున ఇండియా కూటమి నేతలు తరలివస్తున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంపీ ఎంపీ కనిమెళి కరుణానిధి, ఎన్సీపీ- ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డి.రాజా ఇప్పటికే చేరుకున్నారు. పెద్దఎత్తున నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు భారీఎత్తున ప్రముఖ రాజకీయ నేతలు రావడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Also Read : India-Canada : రోజు రోజుకు ముదురుతున్న భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం

Leave A Reply

Your Email Id will not be published!