JCB Driver Subhan: మున్నేరు వాగులో చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడిన పొక్లెయిన్ డ్రైవర్ సుభానీ !
మున్నేరు వాగులో చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడిన పొక్లెయిన్ డ్రైవర్ సుభానీ !
JCB Driver Subhan: సినిమా హీరోలు తెరపై అద్భుతాలు చేస్తుంటారు. ఒంటి చేత్తో పోరాడి వందల మందిని అవలీలగా కాపాడేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ… కొందరు తమ ధైర్య సాహసాలతో రియల్ హీరోలుగా నిలుస్తుంటారు. హరియాణాకు చెందిన సుభాన్ అనే ఎక్సకవేటర్ డ్రైవర్(JCB Driver Subhani) కూడా ఓ రియల్ హీరోనే.. దివ్యాంగుడైనా ప్రకృతిని సవాలు చేస్తూ వరదకు ఎదురెళ్లి ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రాణాలను కాపాడాడు. పోతే ఒక్కడినే.. తిరిగొస్తే తొమ్మిది ప్రాణాలతో వస్తా.. అనే సంకల్పంతో సాహసం చేసి ఖమ్మంలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించి ప్రజలందరితోనూ సలామ్ కొట్టించుకున్నాడు సుభాన్(JCB Driver Subhani). ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
JCB Driver Subhan Saved..
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన ఓజుబోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ఖమ్మంలోని మున్నేరు నదీ తీరంలో చికెన్ షాప్ సహా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయా దుకాణాల్లో 20 మంది వరకు పని చేస్తుండగా వాళ్లలో ఎనిమిది మంది ఆ దుకాణాల వెనకే నివాసముంటారు. ఎప్పట్లాగే వారంతా ఆదివారం ఉదయం కూడా దుకాణాలు తెరిచారు. కానీ, భారీ వర్షాలకు మున్నేరు పొంగడంతో ఉదయం ఎనిమిద్నర ప్రాంతంలో వరద నీరు ఆ దుకాణాలను తాకింది. దీనితో ప్రకాశ్‌నగర్ వంతెనపై తొమ్మిది మంది చిక్కుకుపోయారు. దానికి రెండువైపులా నీరు చేరి… వారు ఎటువైపు వచ్చే పరిస్థితి లేదు. అధికారులకు సమాచారం అందినా సమయానికి బోట్లు లేవు. హెలికాప్టర్ తెప్పించేందుకు ఉన్నతాధికారులు యత్నించినా సాధ్యపడలేదు. అక్కడ చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా ఆహారం, నీరు అందించారు. చూస్తూండగానే చీకటి పడింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెన వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు ప్రకాష్ నగర్ వైపు నుంచి తాడు సహాయంతో బాధితుల దగ్గరికి వెళ్లేందుకు విఫలయత్నం చేశాయి. అనంతరం పడవలను సిద్ధం చేసినా బాధితులను చేరుకోలేకపోయాయి. అయితే రాత్రి 10 గంటల సమయంలో పొక్లెయిన్ యజమాని వెంకటరమణ తన వద్ద పనిచేస్తున్న సుభానీని సంప్రదించారు. హరియాణా రాష్ట్రం మేవాత్ జిల్లాకు చెందిన సుభానీ ఏడేళ్లుగా ప్రకాశ్‌నగర్ వద్ద నివాసముంటూ పొక్లెయిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బాధితులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగలవా అని సుభానీను అడిగితే సరేనన్నారు. పోతే నా ఒక్కడి ప్రాణం.. వస్తే తొమ్మిది మంది ప్రాణాలు అంటూ.. పొక్లెయిన్‌పై కూర్చొని వంతెనపైకి వెళ్లేందుకు యత్నించారు.
వరద ఉద్ధృతికి రెండుసార్లు వెనక్కు తిరిగొచ్చారు. రాత్రి 11:15 గంటలకు ప్రవాహం తగ్గడంతో మళ్లీ వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే ఇంజిన్ మొత్తం మునిగిపోయింది. కొంతదూరం వెళ్లేసరికి నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వాహనాన్ని ఆపేశాడు. అయితే, సుభాన్(JCB Driver Subhan) తో పాటు వెళ్లిన జవహర్ లాల్, ఉపేందర్, నాగేశ్వరరావు… వంతెన పక్కన ఓ చెట్టుకు తాడు కట్టి… దాని సాయంతో వరదలో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్లారు. తిరిగి అదే తాడు సాయంతో ఒక్కొక్కరిని ఎక్స్‌కవేటర్ వద్దకు చేర్చగా.. సుభాన్ అందరినీ సురక్షితంగా వరద నుంచి బయటికి తీసుకొచ్చాడు. సుభానీ సాహసాన్ని ఖమ్మం నగరవాసులు కొనియాడుతున్నారు. బాధితులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా సుభాన్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
Also Read : Air India Fight: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు !