JD Vance: భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై మోదీ, వాన్స్ భేటీ
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై మోదీ, వాన్స్ భేటీ
JD Vance : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాలుగు రోజుల భారత్ పర్యటనకు సోమవారం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వాన్స్ తో పాటు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం వాన్స్ కుటుంబ సమేతంగా అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ… వాన్స్ కుటుంబానికి తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. దీనితో తన సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్ లతో కలిసి లోక్ కళ్యాణ్ మార్గ్ కు చేరుకున్న వాన్స్ కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ(PM Modi)… వాన్స్ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
JD Vance Meet PM Modi
వాన్స్ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్ ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్ ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్ చిన్నకుమారుడు వివేక్… మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్ సూట్ ధరించారు.
అనంతరం ప్రధాని మోదీ(PM Modi), అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్(JD Vance)… ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా సమాలోచనలు జరిపారు. దౌత్యం, చర్చలు మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది భారత్ లో చేపట్టనున్న పర్యటన కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వాన్స్ తో మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. చర్చల సందర్భంగా మోదీ అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రంప్(Trump) ఈ ఏడాదే ట్రంప్ భారతదేశ పర్యటనకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తలపెట్టిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ లాంటిదే తాను తలపెట్టిన వికసిత భారత్ అని మోదీ గుర్తు చేశారు. తన కుటుంబం పట్ల మోదీ కనబరచిన ఆదరాభిమానాలకు వాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రజలతో స్నేహం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాలకూ లాభదాయకంగా ఉండే సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య షెరిటన్ హోటల్ లో బస చేస్తున్న వాన్స్ కుటుంబం రాత్రి ప్రత్యేక విమానంలో జైపూర్ పర్యటనకు వెళ్లింది. మంగళవారం అంబర్ ఫోర్ట్ ను సందర్శిస్తారు. పర్యటనలో భాగంగా వాన్స్ 23న ఆగ్రాను సందర్శించనున్నారు. తిరిగి జైపూర్ వచ్చి అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళతారు. అమెరికా ఉపాధ్యక్షుడి రాకతో ఢిల్లీలో భద్రతను భారీ ఎత్తున పెంచారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా వాన్స్‌కు ఇదే తొలి భారత పర్యటన. ఆయనకు ముందు జో బైడెన్ ఉపాధ్యక్ష హోదాలో 2013లో భారత్‌లో పర్యటించారు.
Also Read : Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీకి ‘డి’ కంపెనీ బెదిరింపులు