Kancha Gachibowli Lands: కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక

కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక

Kancha Gachibowli : తెలంగాణా రాజకీయాల్లో రచ్చ రేపిన కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారంలో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. అనంతరం అధికారులతో భేటీ అయింది. దాదాపు 3 గంటలపాటు ప్రభుత్వ అధికారులతో కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్‌, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. 400 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ విధివిధానాలు, ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కమిటీకి నివేదిక సమర్పించారు.

Kancha Gachibowli Lands Issue

కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారంలో గురువారం కమిటీ వరుస సమావేశాలు నిర్వహించింది. ఉదయం భూములను సందర్శించిన కమిటీ… క్షేత్రస్థాయిలో పరిస్థితులపై వివరాలను తెలుసుకుంది. అనంతరం ఎంసీహెచ్‌ఆర్‌డీలో విద్యార్థి సంఘాల నేతలతో భేటీ అయి.. వివరాలు సేకరించింది. తాజ్ కృష్ణలో బీఆర్ఎస్ నేతలతో భేటీ అయింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం ఈ వ్యవహారంపై కమిటీకి నివేదిక ఇచ్చింది. హెచ్‌సీయూ పాలకవర్గం, బీజేపీ ఎంపీలతోనూ భేటీ అయిన కమిటీ… భూముల అంశంపై సమగ్ర వివరాలు తీసుకుంది.

టీజీఐఐసీ ఈ భూములను చదును చేపట్టిన నేపథ్యంలో… సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సెంట్రల్‌ ఎంపవర్‌ కమిటీ ఛైర్మన్‌ సిద్ధాంత దాస్, మరో ఇద్దరు సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. వీరు కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరిపి… వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకు నివేదిక అందించనున్నారు.

Also Read : Tax Notice: కూలీకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు ! 314 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు !

Leave A Reply

Your Email Id will not be published!