Kangana Ranaut: కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్‌ !

కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్‌ !

Kangana Ranaut: బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంట్ నుండి విజయం సాధించిన కంగనా రనౌత్‌(Kangana Ranaut) కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ కూటమి అభ్యర్ధుల సమావేశానికి… చండీగఢ్‌ నుండి బయలుదేరిన కంగనను … విమానాశ్రయం సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ చెంపదెబ్బ కొట్టారు. దీనితో కంగన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారాయి. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన… విమానం ఎక్కేందుకు చండీగఢ్‌ విమానాశ్రయంలో బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగన చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కంగన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Kangana Ranaut – నేను క్షేమంగానే ఉన్నా – కంగనా !

తనపై జరిగిన దాడి ఘటనపై కంగనా రనౌత్ స్పందించారు. తాను బాగానే ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయి పాస్‌ కోసం వేచి చూస్తుండగా… సెక్యూరిటీ మహిళా ఆఫీసర్‌ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు తనను దూషించారన్నారు. ఎందుకిలా చేశావని అడిగితే… తాను రైతు నిరసనలకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్లు కంగన తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని… కాకపోతే పంజాబ్‌ లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందన్నారు. మరోవైపు ఢిల్లీ చేరుకున్న అనంతరం కంగన సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఇతర సీనియర్‌ అధికారుల్ని కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీనితో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్‌ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ కార్యాలయానికి తరలించారు.

Also Read : Jairam Ramesh : త్వరలో ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీకి 4 ప్రశ్నలు

Leave A Reply

Your Email Id will not be published!