Kesineni Chinni: ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక !

ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక !

Kesineni Chinni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పి.వెంకట రమణ ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్‌ బాబు, జాయింట్‌ సెక్రటరీగా పి. విష్ణు కుమార్‌ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా డి. గౌర్‌ విష్ణు తేజ్‌లు పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పదవులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా క్రికెట్ అసోసియేషన్లకు, క్రికెట్ క్లబ్‌లకు ఈ సందర్భంగా కేశినేని చిన్ని(Kesineni Chinni) ధన్యవాదాలు తెలిపారు.

Kesineni Chinni Comment

ఈ సందర్బంగా ఏసీఏ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(Kesineni Chinni) మాట్లాడుతూ ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిలోపే సిద్దం చేసి రాజధాని ప్రాంతానికి అందిస్తామని తెలిపారు. ఈ స్టేడియంలో ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నంలో రెండో క్రికెట్ స్టేడియం నిర్మాణంతోపాటు అన్ని జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. కడపలో గత పాలకవర్గం హయాంలో నిర్మించిన స్టేడియాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన ఆటగాళ్ల అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అకాడమీలు స్థాపించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఏసీఏలో బయటి వారి జోక్యం ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గత పాలక వర్గంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం ఏసీఏ తరఫున సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళంగా ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే చినని తీసుకున్న తొలి నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : AP Police Officers Association: వరద బాధితులకు ఏపీ పోలీసు అధికారుల సంఘం భారీ విరాళం !

Leave A Reply

Your Email Id will not be published!