Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితునికి బెయిల్ మంజూరు

కాగా, విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది...

Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన తిరుపతన్న 10 నెలలుగా జైలులోనే ఉన్నారు. మెుదట బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును తిరుపతన్న పలుమార్లు ఆశ్రయించగా నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Phone Tapping Case Updates

కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, తిరుపతన్న తరఫున సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ఇంకా ఎంత సమయం పడుతుందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర ధర్మాసనం లూథ్రాను ప్రశ్నించగా.. నాలుగు నెలలంటూ ఆయన తెలిపారు. ఈ మేరకు ఇంకెంత కాలమంటూ ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అయితే నిందితుడు 10 నెలలుగా జైలులోనే ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. పిటిషినర్ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ ఇచ్చింది. కేసు విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయెుద్దంటూ తిరుపతన్నను ఆదేశించింది.

ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది. కాగా, బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతల ఒత్తిడితో అధికారులు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. 03, డిసెంబర్ 2023న తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాడే ఆధారాలు సైతం ధ్వంసం చేశారని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్ననే ప్రధాన నిందితుడు అంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, దాదాపు పది మాసాలుగా జైల్లో ఉన్న ఏఎస్పీ.. సుప్రీంకోర్టు తీర్పుతో విడుదల కానున్నారు.

Also Read : YS Jagan Case-SC : మాజీ సీఎం జగన్ కేసులపై ధర్మాసనం సంచలన ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!