Kolleru Flow : కొంపలు ముంచేస్తున్న కొల్లేరు…నీట మునిగిన లంక గ్రామాలు
పెదపాడు మండలంలో పలు గ్రామాలకు రామిలేరు వరద ఉధృతంగా వస్తోంది.
Kolleru Flow : భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. గ్రామాలకు వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి. స్ధానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. విజయవాడలో విలయ తాండవం చేసిన బుడమేరు.. ఇప్పుడు కొల్లేరు(Kolleru) ప్రాంతాన్ని వణికిస్తోంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, ఇంకోవైపు రామిలేరు…ఇలా అన్ని వాగుల నుంచి వచ్చిన వరద కొల్లేరును చుట్టుముట్టింది. దీంతో కొల్లేరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి కొల్లేరు గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునగడంతో… రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు – కైకలూరు మెయిన్ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు. భారీ వాహనాలను మాదేపల్లి , కైకలూరు దగ్గర నిలిపివేశారు. చిన ఎడ్లగాడి దగ్గర వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దగ్గర ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొల్లేరు(Kolleru) నుంచి ఉప్పుటేరులోకి భారీగా వరద వస్తుండడంతో…ఆకివీడు, చినకాపవరం, దుంపగడప, సిద్దాపురం, చినిమిల్లిపాడు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 140 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Kolleru Flow Updates
పెదపాడు మండలంలో పలు గ్రామాలకు రామిలేరు వరద ఉధృతంగా వస్తోంది. గోగుంట, రాళ్లపల్లి వారిపాలెం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా గ్రామాల్లో నడుం లోతు నీటిలో వరద నీరు ప్రవహిస్తోంది. కొల్లేరు, ఉప్పుటేరులో పూడికలు తీయడంలో గత సర్కార్ నిర్లక్ష్యం వహించడంతోనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వరద బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. ఆక్రమణలు తొలగిస్తే…కొల్లేరు వరద నుంచి తమకు విముక్తి కలుగుతుందంటున్నారు లంక గ్రామాల వాసులు. మరోవైపు గుడివాక లంకలో గంగమ్మ తల్లికి మత్స్యకార మహిళలు పూజలు చేశారు. కొల్లేరు ఉధృతి తగ్గించి తమను కాపాడాలని మొక్కుకున్నారు. తమకు సహాయం అందించాలని ప్రభుత్వానికి కొల్లేరు వరద బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఉప్పుటేరు గట్లు బలహీనంగా ఉన్న చోట వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వేస్తున్నారు.
Also Read : Murali Mohan : హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీమోహన్