KTR : టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న కేటీఆర్
టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు...
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పదవిని ఊడబీకటానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్(KTR) అన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తరచుగా చెప్తున్న ఫోర్త్ సిటీ కాదని.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తామని కేటీఆర్ అన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయానని సీఎంకు కూడా తెలుసునని అన్నారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
KTR Slams…
టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీజే దగ్గరకు రావడం ఇష్టం లేదంటే.. ఢిల్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకైనా రావాలన్నారు. సీఎం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని టెండర్లు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సీఎం, మంత్రులు.. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలసి సింగరేణిని ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.
కిషన్ రెడ్డి ఆధ్వరంలో జరిగిన వేలంపాటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నవ్వుతూ వెళ్ళి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను ప్రభుత్వం తగ్గించిందని ఆరోపించారు. లాభాల్లో వాటాను 33శాతం కాకుండా.. 16.9శాతమే పంచుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షా 90వేలు కాదని.. రూ. 3లక్షల 70వేలు బోనస్‌గా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల వాటా తగ్గింపుపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్పందించాలన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వాటా పెంచాలని కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలసి ఒత్తిడి చేయాలని సూచించారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
Also Read : Team India : చెన్నై టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన ఇండియా