Kunal Kamra: స్టూడియోను కూల్చడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా ఆగ్రహం
స్టూడియోను కూల్చడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా ఆగ్రహం
Kunal Kamra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే పై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్ లోని హాబిటాట్ కామెడీ స్టూడియోలో స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా(Kunal Kamara) హాస్య వినోద కార్యక్రమం నిర్వహించి దానిని రికార్డు చేశారు. ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందేను(Ekanth Shinde) ‘‘గద్దార్’’ (ద్రోహి) గా అభివర్ణిస్తూ ‘దిల్‌తో పాగల్ హై’ హిందీ చిత్రంలోని ఒక సినీ గీతానికి పేరడీని కామ్రా ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది.
దీనితో ఉపముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్ స్టూడియోపై దాడి చేసి వేదికను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివసేన నాయకుడు రాహుల్ కనల్ ను, మరో 11 మందిని పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అంతేకాదు ఏక్‌నాథ్ శిందేను అవమానపరిచినందుకు కునాల్ కామ్రా(Kunal Kamra) క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(CM Fadnavis) సోమవారం డిమాండ్ చేశారు.
Kunal Kamra Slams
అయితే ఈ ఘటన అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన యూనికాంటినెంటల్ హోటల్ లోని హాబిటాట్ కామెడీ స్టూడియోను బృహన్ ముంబయి పురపాలక సంస్థ కూల్చేసింది. హోటల్ లోని బేస్‌మెంటులో అనుమతులు లేకుండా నిర్మించిన కారణంగానే స్టూడియోను కూల్చివేశామని పురపాలక సంస్థ అధికారులు తెలిపారు. తాజాగా దీనిపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా స్పందించారు. తాను కామెడీ చేయడానికి ఉపయోగించిన వేదికను కూల్చడం సరికాదన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.
‘హాబిటాట్ కామెడీ స్టూడియో ఒక వేదిక మాత్రమే. నేను చేసిన కామెడీకి ఆ వేదికను కూల్చడం సరికాదు. ఆ వేదికను నియంత్రించే అధికారం ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. ఇది అర్ధం లేని చర్య. ఒక ప్రజానాయకుడిపై నేను వేసిన జోక్ ను తీసుకోలేని మీ అసమర్థత నా హక్కును, స్వభావాన్ని మార్చదు. నాకు తెలిసినంతవరకు మన నాయకులను, సర్కస్ లాంటి రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేయడం చట్ట వ్యతిరేకం కాదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒకప్పుడు ఏక్‌నాథ్ శిందే గురించి చెప్పినవే ఇప్పుడు నేను మాట్లాడాను. నేను ఎవరికీ భయపడను. ఎవరికీ క్షమాపణ చెప్పను’ అని కునాల్ పేర్కొన్నారు.
తనకు గుణపాఠం చెబుతానని రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ… వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులమైన వారికి మాత్రమే కాదని తెలిపారు. తనపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తాను చేసిన కామెడీకి విధ్వంసమే తగిన సమాధానం అని నిర్ణయించుకొని వేదికను కూల్చిన వారికి కూడా చట్టం, న్యాయం సమానంగా వర్తిస్తాయా..? అని కునాల్ ఈసందర్భంగా కునాల్ ప్రశ్నించారు.
Also Read : Himachal Deputy CM: హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం, డీజీపీలకు త్రుటిలో తప్పిన ప్రమాదం