Lagacherla Case : సర్కారుకు వ్యతిరేకంగా రైతుల నినాదాలు
కాగా నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం రైతులకు బెయిలు మంజూరు చేసింది...
Lagacherla : లగచర్ల కేసులో నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న 16 మంది రైతులు శుక్రవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. కాగా రైతులు జైలు నుంచి బయటకు రాగానే రైతులకు గిరిజన సంఘాలు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేశారని, మేం సంఘటన ప్రదేశంలో కూడా లేమని అన్నారు. అర్ధరాత్రి అరెస్టు చేశారని, పరిగి పొలీస్ స్టేషన్‌లో మమ్మల్ని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. పరిహారం, ఉద్యోగాలు ఇచ్చినా తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. జైల్లో ఉన్న మిగిలిన రైతులకు బెయిలు ఇప్పించాలన్నారు. గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి గొడవకు కారణమని.. కానీ అతన్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని.. శేఖర్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని రైతులు అన్నారు.
Lagacherla Case Updates
కాగా నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం రైతులకు బెయిలు మంజూరు చేసింది.గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో నిన్న రైతులు విడుదల కాలేదు. ఈ రోజు విడుదలయ్యారు. లగచర్ల(Lagacherla) కేసులో ప్రధాన నిందితుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు.. మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.నరేందర్‌రెడ్డికి రూ.50 వేల చొప్పున రెండు ష్యూరిటీలను సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతీ వారం బొంరాస్‌పేట ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరై, విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. మిగతా నిందితులు రూ.20 వేల ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది.
నరేందర్‌రెడ్డిచర్లపల్లి జైలులో.. ఏ2 సురేశ్‌రాజ్ సహా.. మిగతా నిందితులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్లపై బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ సభ్యులు లక్ష్మణ్, శుభప్రద్ పటేల్, రాంచందర్‌రావు వాదనలను వినిపించారు. నిజానికి వికారాబాద్, కొడంగల్ కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు దాఖలవ్వగా.. వాటిని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. మంగళవారంతో వాదనలు పూర్తవ్వగా.. న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. మరోవైపు.. లగచర్ల(Lagacherla) ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆరుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : Virat Kohli : మీడియాకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన కింగ్ కోహ్లీ