Lift Accident: లిఫ్ట్‌ ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి

లిఫ్ట్‌ ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి

Lift Accident : ఇటీవలి కాలంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు అపార్ట్ మెంట్ వాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మహా నగరంలోని సూరారం శ్రీకృష్ణ నగర్ లోని మణికంఠ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ (39) అనే ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్‌ మెంట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్‌ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Lift Accident in Hyderabad

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… ఆదివారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ వద్ద కొంతమంది చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్నారు. అనుకోకుండా బాల్ లిఫ్ట్ గుంతలో పడిపోయింది. స్థానికంగా ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు అక్బర్ పటేల్ బాల్ తీసేందుకు గుంతలోకి దిగాడు. అదే సమయంలో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అతనిపై(Lift Accident) పడింది. దీనితో అక్కడికక్కడే అక్బర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే బిల్డర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్‌ లోని లిఫ్ట్ గోడలు నాలుగు వైపులా తెరిచి ఉన్నాయని, కనీసం ఎలాంటి రక్షణ ఏర్పాట్లూ చేయలేదని మండిపడుతున్నారు. బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని, మృతుడు అక్బర్ ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు.

గత నెలలో నాంపల్లిలో లిఫ్ట్‌ లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. మరో ఘటనలో మెహదీపట్నంలోని ఆసిఫ్‌ నగర్‌ ఠాణా పరిధి సంతోష్‌ నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది. ఆసిఫ్‌నగర్‌ లో ఏప్రిల్ ఏడో తేదీన మరో ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు అవ్వగా… వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు ఉన్నారు. లిఫ్ట్‌ పైకి వెళ్లి కిందకు వచ్చే క్రమంలో ఒక్కసారిగా పట్టు కోల్పోయి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయింది.

Also Read : Asaduddin Owaisi: వక్ఫ్‌ బిల్లుపై ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ అసదుద్దీన్‌ ఓవైసీ

Leave A Reply

Your Email Id will not be published!