Lionel Messi Comment : విరామం ఎరుగ‌ని యోధుడు

పుట్ బాల్ దిగ్గ‌జం మెస్సీ ఇక సెలవా

Lionel Messi Comment : కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువు తీరిన యోధుడు అత‌డు. ఒక్క‌సారి మైదానంలోకి వ‌చ్చాడంటే ఇక గుండెల‌న్నీ ఒక్క‌టై పోతాయి. ల‌బ్ డబ్ మంటూ కొట్టుకుంటాయి. అత‌డు బంతిని ఆడుతూ వుంటే కెర‌టాలు ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డుతున్న‌ట్లు చ‌ప్ప‌ట్ల‌తో హోరెత్తుతుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అహోరాత్రులు నిద్ర‌హారాలు మాని త‌మ అభిమాన ఆట‌గాడి కోసం మాత్ర‌మే చూసేలా చేసుకున్న అరుదైన ఆట‌గాడు..ఫుట్ బాల్ క్రికెట్ రంగంలో రారాజు లియోనెల్ మెస్సీ. అత‌డు వేసే అడుగు, మాట్లాడే మాట‌, చేసే గోల్..ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లు కుమ్మ‌రిస్తూనే ఉంటాయి.

కానీ ఈ దిగ్గ‌జ యోధుడి గురించి చెప్పాలంటే క‌నీసం ఏడాది స‌మ‌యం ప‌డుతుంది. ఒక సామాన్యుడిగా మొద‌లైన మెస్సీ ప్ర‌స్థానం అర్జెంటీనాను శాసించే స్థాయికి తీసుకు వెళ్లేలా చేసింది. దాని వెనుక క‌ఠోర‌మైన శ్ర‌మ ఉంది. అంత‌కంటే తాను ఎంచుకున్న ఆట ప‌ట్ల నిబ‌ద్ద‌త ఉంది. 

నా శ‌రీరంలో స‌త్తువ ఉన్నా, ఆడాల‌ని కోరిక ఉన్నా అభిమానులు ఛీద‌రించుకోక ముందే తాను ఈ ఫుట్ బాల్ యుద్ద రంగం నుంచి నిష్క్ర‌మించ‌డమే మంచిద‌ని ప్ర‌క‌టించిన దిగ్గ‌జం మెస్సీ(Lionel Messi) . ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ నాకు చివ‌రిది అని ప్ర‌క‌టించాడు.

దీంతో యావ‌త్ ప్ర‌పంచం..ఫుట్ బాల్ లోకం..అభిమాన సంద్రం ఒక్క‌సారిగా విస్మ‌యానికి లోనైంది. మెస్సీ మెస్సీ అంటూ దిక్కులు పిక్క‌టిల్లేలా ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు.

దీని వెనుక ప్రేమ ఉంది. అంత‌కంటే ఆరాధ‌న ఉంది. బంతిని మెస్సీ వాడే విధానం చాలా గొప్పగా అంత‌కంటే అద్భుతంగా ఉంటుంది.

అందుకే మెస్సీ అంటే అభిమానం. అంతులేని వాత్సల్యం కూడా. మెస్సీ చూస్తే పొట్టిగా ఉంటాడు. కానీ గ‌ట్టోడు. ఈ కీల‌క స‌మ‌యంలో తాను సెల‌వు తీసుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ప్ర‌క‌టించాడు.

అందుకే మెస్సీని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సి వ‌స్తోంది. ఓ వైపు సంబురాలు చేసుకుంటున్నా మ‌రో వైపు అభిమానులు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.మెస్సీ లేని అర్జెంటీనాను ఊహించ‌గ‌ల‌మా అని. 

కానీ ఎప్పుడో ఒక‌ప్పుడు ప్ర‌తి ఆట‌గాడు నిష్క్ర‌మించాల్సిందే. చ‌ప్ప‌ట్లు కురిపించే చేతులు ఒక్కోసారి రాళ్లు కూడా వేస్తాయ‌ని గ్ర‌హించాడు మెస్సీ. అందుకే అభిమానం త‌ర‌గ‌క ముందే త‌ను గుడ్ బై చెప్పాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

అందుకేనేమో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గ‌జం డిగో మార‌డోనా అన్నాడు..నా స్థానాన్ని వార‌స‌త్వంగా పొందే ఆటగాడు ఎవ‌రా అని చూశాను..అత‌డు ఎవ‌రో కాదు మెరికలాంటోడు మెస్సీ.

ఇక మెస్సీకి 35 ఏళ్లు. పూర్తి పేరు లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ. పుట్టిన ఊరు శాంటా ఫే లోని రోసారియా. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో మెస్సీ ఒక‌డు. అత‌డితో పాటు రొనాల్డో కూడా ఉన్నాడు.

ఇద్ద‌రూ వేర్వేరు దేశాల‌కు చెందిన వారైనా ఆట‌లో మాత్రం ద‌మ్మున్నోళ్లు. అత‌డి క‌ళ్లు పాద‌ర‌సంలా ఉంటాయి. కాళ్లు మిస్సైల్స్ కంటే వేగంగా ప‌రుగులు తీస్తుంటాయి. మైదానంలో ప్ర‌త్య‌ర్థుల‌కు చిక్క‌కుండా క‌ళ్లు చెదిరే లోపు బంతుల్ని రాకెట్ లా గోల్స్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్నోడు మెస్సీ.

ఇంతటి స్థాయికి చేరుకునేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఐదేళ్ల వ‌య‌స్సు నుంచే బంతిని ప్రేమించాడు. దానితో ఆడుకోవ‌డం మొద‌లు పెట్టాడు. 11 ఏళ్ల‌ప్పుడు హార్మోన్ లోపం బ‌య‌ట ప‌డింది. 

చికిత్స ఖ‌రీదైన‌ది కావ‌డంతో పేరెంట్స్ త‌ల్లడిల్లి పోయారు. చివ‌ర‌కు అత‌డి ప్ర‌తిభ‌ను గుర్తించిన బార్కా క్ల‌బ్ సాయం చేసింది. ఒక ర‌కంగా మెస్సీని ఆదుకుంది. 2006-2007లో మెస్సీ కెరీర్ లో గొప్ప మ‌లుపు. 13 గేమ్స్ ఆడాడు. 11 గోల్స్ చేశాడు. కొంత కాలం పాటు గాయాలు వెంటాడాయి.

కానీ త‌నలోని క‌సిని కోల్పోలేదు మెస్సీ. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు. అన్ని పోటీల్లో అప్ప‌టికే 38 గోల్స్ చేశాడు. యుఈఎఫ్ఏ ఛాంపియ‌న్స లీగ్ ఫైన‌ల్స్ లో ఓడించి మాంచెస్ట‌ర్ యునైటెడ్ పై ప్ర‌తీకారం తీర్చుకున్నాడు మెస్సీ. 

అయితే మెస్సీ స్పానిష్ పౌరుడు కానీ అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించాడు. గాయాలు వెంటాడుతూనే ఉన్నా ఎక్క‌డా త‌గ్గ‌లేదు మెస్సీ(Lionel Messi) .

ఇలా చెప్పుకుంటూ పోతే మెస్సీ ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాలు అందించాడు అర్జెంటీనాకు. అలుపెరుగ‌ని పోరాటం..ఆట ప‌ట్ల నిబ‌ద్దత‌..విజేత‌గా నిల‌వాల‌న్న క‌సి..దేశం ప‌ట్ల ప్రేమ మెస్సీని అంద‌నంత ఎత్తులో ఉంచాయి. మెస్సీ ఒక ఆట‌గాడు మాత్ర‌మే కాదు కోట్లాది జ‌నం గుండె ల‌బ్ డ‌బ్.

Also Read : ఫ్యాన్ బాల్’ ఉంటే స‌త్తా చాటే వాళ్లం

Leave A Reply

Your Email Id will not be published!