Maharashtra CM : రాజీనామాకు సిద్దమైన మహారాష్ట్ర సీఎం షిండే
షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది...
Maharashtra CM : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ‘మహాయూతి’ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి ఎంపికపై కూటమి నేతల్లో ఓవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. షిండే(Eknath Shinde) ఉదయమే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని, కొత్త ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Maharashtra CM Resign..
కాగా,సీఎం పదవికి సంబంధించి ఏదైనా ఫార్ములా అనుకుంటున్నారా అనే ప్రశ్నపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారంనాడు స్పష్టత ఇచ్చారు. అలాంటి ఫార్ములా ఏదీ లేదని, మహాయుతి భాగస్వాములు సమష్టిగా సీఎం ఎవరనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈనెల 27వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందంటూ వినిపిస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. మహాయుతి కూటమికి చాలా పెద్ద విజయాన్ని ప్రజలు అందించారని, పటిష్టమైన ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మహారాష్ట్రకొత్త సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.తనవర్గం (రెబల్ వర్గం) శివసేన ఎమ్మెల్యేలలో ఒక్కరు ఓడిపోయినా రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఏక్‌నాథ్ షిండే గతంలో చేసిన వాగ్దానాన్ని ఉద్ధవ్ శివసేన గుర్తు చేసింది.ఈమేరకు పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం రాసింది. షిండే శివసేనకు చెందిన 40 ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు సదా సర్వాంకర్, యామిని జాదవ్, సాహజి బాపు పాటిల్, సంజయ్ రాయ్ ముల్కర్, జ్ఞానరాజ్ చౌగులే ఈ ఎన్నికల్లో ఓడిపోయినందున తక్షణమే రాజకీయాల నుంచి షిండే తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
Also Read : Deputy CM Pawan : హస్తినలో కేంద్రమంత్రులతో బిజీ బిజీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్