Mallikarjun Kharge Comment : ‘విధేయత’కు దక్కిన విజయం
గట్టి పోటీ ఇచ్చిన శశి థరూర్
Mallikarjun Kharge Comment : ఎంతో కాలంగా ఎవరు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉండబోతున్నారనేది తేలి పోయింది. తెర మీద ఆవిష్కృతమైంది. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా , విధేయుడిగా పేరొందిన మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేశారు. తన సమీప ప్రత్యర్థి తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పై 6, 987 ఓట్లకు పైగా సాధించారు.
ఇక అభ్యర్థి ఎంపిక నాటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు టెన్షన్ వాతావరణం నెలకొన్నా చివరకు గాంధీ ఫ్యామిలీని కాదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేరే వ్యక్తికి కట్టబెట్టే ఛాన్స్ లేదని ఇవాల్టి ఫలితంతో నిరూపితమైంది. ఎవరు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికైనా పవర్ అంతా సోనియా గాంధీ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుందన్న ప్రచారం లేక పోలేదు.
ఇదంతా పక్కన పెడితే మల్లికార్జున్ ఖర్గేకు అరుదైన అవకాశం దక్కిందని చెప్పక తప్పదు. 137 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీకి అన్నీ తానే కానున్నారు. ఇప్పటి వరకు వ్యతిరేకించిన వాళ్లు సైతం తప్పని పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గా అంగీకరించక తప్పదు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా చేసిన డిక్లరేషన్ అమలు చేస్తానని పోటీ సందర్భంగా పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే. ఆయనకు ఈ పదవి అందివచ్చిన అవకాశమే అయినప్పటికీ పెను సవాల్ . ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు వెళ్లి పోతున్నారు.
కార్యకర్తల బలగం ఉన్నప్పటికీ ఎన్నికలు వచ్చే సరికల్లా ప్రధాన పోటీదారుగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఢీకొనలేక పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణాదిన కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
తన స్వంత ప్రాంతం కావడంతో ఖర్గేకు ఇది అగ్ని పరీక్ష కానుంది. ఇక 2024లో కాంగ్రెస్ పార్టీని దేశ వ్యాప్తంగా పవర్ లోకి తీసుకు రావాలంటే ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంది. ఓ వైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఊహించని మద్దతు లభిస్తోంది.
మరో వైపు బీజేపీ కాంగ్రెస్ కంటే ముందంజలో ఉంది. కేంద్ర సర్కార్ ను ఎదుర్కోవడంతో పాటు పార్టీని బలపేతం
చేయడం మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ముందున్న టార్గెట్. ఇది పక్కన పెడితే పార్టీలోని అసంతృప్తులను సముదాయించడం కూడా ఆయనకు కత్తి మీద సాము లాంటిదే.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొలువు తీరిన ఖర్గే పూర్తి పేరు మాపన్న మల్లికార్జున ఖర్గే. గతంలో కేంద్ర మంత్రిగా, ఎంపీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన ఖర్గే ఏ మేరకు పార్టీని నడిపిస్తారనేది వేచి చూడాల్సిందే.
Also Read : ఓటమి పాలైనా చెరగని ముద్ర