Manipur CM Resign : గవర్నర్ కు రాజీనామా సమర్పించిన మణిపూర్ సీఎం
బీజేపీ సీనియర్ నాయకులను కలిసిన తర్వాత..
Manipur CM : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలోని గొంతుకు ఆయన గొంతుకు 93% సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆడియో లీక్ అంశంపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యుమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతోంది. మరోవైపు బీరెన్(Biren Singh)పై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సిద్ధమైంది. సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. 12 మంది సొంత ఎమ్మెల్యేలే ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో పాటు మరో ఆరుగురు కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అలాగే ఆయనకు, స్పీకర్‌కు పడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బీరెన్‌సింగ్.. బీజేపీ సీనియర్ నాయకులను కలిసిన తర్వాత ఆదివారం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. అయితే, తదుపరి ఏర్పాట్లు జరిగేదాకా సీఎంగా కొనసాగాలని బీరెన్‌సింగ్‌ను గవర్నర్ కోరారు.
Manipur CM Biren Singh Resign
మణిపూర్‌లో రెండేళ్లుగా మైతేయి కుకీల మధ్య హింస చెలరేగుతూనే ఉంది. అందులో వందలాది మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే అల్లర్లలో మైతేయిలను బీరెన్ సింగ్ ప్రేరేపిస్తున్నట్లు డిసెంబరులో ఓ ఆడియో లీకయింది. అందులో.. ‘‘ప్రభుత్వ కార్యాలయ్యాల్లోని ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయిలకు అవకాశమివ్వండి’’ అని ఆయన ఆదేశించినట్లు ఉంది. ఆ ఆడియోలోని గొంతుకు బీరెన్ సింగ్(Biren Singh) గొంతుకు 93ు సారూప్యత ఉన్నట్లు హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సుప్రీం కోర్టును సమర్పించి, బీరెన్‌పై తగు చర్యలు తీసుకోవాలని కుకీ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. అయితే కేంద్రం, మణిపూర్ సర్కార్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసును మణిపూర్ హైకోర్టు విచారించాలని ఆయన పేర్కొనగా దీనిపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటాని సుప్రీం తెలిపింది. ఈ ఆడియోపై కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజీనామా ముందు బీరెన్ సింగ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, షాలతో భేటీ అయ్యారు. సాయంత్రం ఇంఫాల్‌కు వచ్చి రాజ్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భళ్లాకు తన రాజీనామా లేఖ సమర్పించారు. బీరెన్ సింగ్ రాజీనామా నేపథ్యంలో సోమవారం ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ అజయ్ కుమార్ భళ్లా రద్దు చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా ఇప్పటికే ఆలస్యమైందని కాంగ్రెస్ పేర్కొంది. బీరెన్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైందని, పరిస్థితి గ్రహించిన బీరెన్ వెంటనే రాజీనామా చేశారని అన్నారు. తరచూ ప్రయాణాలు చేసే మోదీ మణిపూర్ ఎప్పుడు వస్తారని ఎదురుచూస్తున్నామని ఆయన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read : MLA KTR : చిలుకూరు పూజారి పై జరిగిన దాడిపై స్పందించిన మాజీ మంత్రి