Manipur: మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత ! ఒకరి మృతి ! 40 మందికి గాయాలు !
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత ! ఒకరి మృతి ! 40 మందికి గాయాలు !
Manipur : మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ తెగ నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఆదేశాల మేరకు శనివారం నుంచి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిచ్చారు. అయితే తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దంటున్న కుకీలు కాంగ్ పోక్పి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా… 40 మంది వరకు గాయాలపాలయ్యారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి కుకి జో ప్రాంతంలో నిరవధిక బంద్‌కు కుకి జో మండలి పిలుపునిచ్చింది. కుకీల ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు వాహనాలపై రాళ్లు రువ్వడమేకాకుండా రోడ్లను తవ్వారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో దాదాపు 114 ఆయుధాలు, ఐఈడీలు, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు సీజ్ చేశాయి.
Manipur Issue Raise Again
హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఆదేశాలను నిరసిస్తూ కంగ్‌పోక్పి వద్ద రెండో నంబర్ ఇంఫాల్–దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. అడ్డుకునేందుకు యత్నించిన భద్రతా సిబ్బందితో వారు ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేట్ వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయతి్నంచడంతో పరిస్థితి చేయి దాటింది. దీనితో, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్‌పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్‌పోక్పి వద్ద అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి, నిరసన కారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని చెప్పారు.
Also Read : Mallikarjun Kharge: కర్ణాటక సీఎం సిద్ధు, డిప్యూటీ సీఎం డీకేలకు మల్లికార్జున ఖర్గే క్లాస్