Ponnam Prabhakar: కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల డిమాండ్
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల డిమాండ్
Ponnam Prabhakar : కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw)ను కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatreddy) ఆధ్వర్యంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు చామల కిరణ్‌కుమార్, కడియం కావ్య… కేంద్ర మంత్రిని శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో కలిసి వినతిపత్రాలు అందించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయడంతో పాటు, వాటిని పూర్తిగా రైల్వే నిధులతోనే నిర్మించేలా సహకరించాలని, ప్రస్తుతం కాజీపేటలో కొనసాగుతున్న రైల్వే తయారీ యూనిట్ పనులను వేగవంతం చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. వరంగల్ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు రింగ్ రైల్ ను నిర్మించే అంశంపై కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు.
కాగా, మార్కెట్ నిర్మాణం కోసం వరంగల్ మండలం గిర్మాజీపేట్‌లో సర్వే నెంబర్ 8లోని రైల్వేకు చెందిన స్థలంలో 1.10 ఎకరాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ రైల్వే మంత్రికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. గిర్మాజీపేట్ గ్రామంలోని రైల్వే అండర్ బ్రిడ్జికి సమీపంలో నిరంతరం వీధివ్యాపార కార్యకలాపాలు కొనసాగడంతో ఈప్రాంతం నుంచి వచ్చి వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
Ponnam Prabhakar – కరీంనగర్ నుంచి తిరుపతికి డైలీ ట్రైన్ నడపాలి – మంత్రి పొన్నం లేఖ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి రోజూ తిరుపతికి రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు.
‘‘ప్రస్తుతం కరీంనగర్ నుంచి వారానికి రెండు సార్లు (గురువారం, ఆదివారం) మాత్రమే తిరుపతికి రైలు వెళ్తోంది. అదే రైలు తిరుపతి నుంచి కరీంనగర్ కు బుధ, శనివారాల్లో తిరిగి బయలుదేరుతుంది. యూపీఏ హాయాంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైలును ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్లడానికి వీలుగా, సులభతరంగా ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రస్తుతం తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రతిరోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వాన్ని గత పదేళ్లుగా కోరుతున్నాను. ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని నిత్యం కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు నడిచేలా చర్యలు తీసుకోండి’’ అని లేఖలో పేర్కొన్నారు.
అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి తుమ్మల అభినందన లేఖ
పాండురంగాపురం-మల్కాన్‌గిరి రైల్వేలైన్ మం జూరు చేసినందుకు అశ్విని వైష్ణవ్‌కు మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి(అమరావతి) వర కు కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలని ఇదే అంశంపై రాసిన లేఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కేంద్ర మంత్రికి అందజేశారు. కాగా, కరీంనగర్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కరీంనగర్ లకు ప్రతి రోజూ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.
Also Read : Manipur: మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత ! ఒకరి మృతి ! 40 మందికి గాయాలు !
