ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో నేరాలపై ఉక్కుపాదం

స్ప‌ష్టం చేసిన హోం శాఖ మంత్రి అనిత

విజయవాడ : నేరం ఆధునికమైతే పోలీసింగ్ అంతకంటే ఆధునికం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఫ్యాక్షన్ నుంచి సైబర్ నేరాల వరకు ఈగ‌ల్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో నేరాలపై ఉక్కుపాదం మోపాల‌ని స్ప‌ష్టం చేశారు. మహిళలపై నేరాలు తగ్గించాల‌ని, సాంకేతిక పోలీసింగ్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీ నిల‌వాల‌ని పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్–2026 కార్యక్రమానికి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని ఆమె అన్నారు. 2001లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పోలీసు సంస్కరణల రిట్రీట్ సంప్రదాయాన్ని 25 సంవత్సరాల అనంతరం అదే దూరదృష్టి, అదే సంస్కరణల స్ఫూర్తితో పునరుద్ధరించడం చారిత్రాత్మకమని హోంమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ కార్యాలయం, జిల్లా ఎస్పీలు, పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు చేస్తున్న సేవలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, వామపక్ష తీవ్రవాదం, మత కలహాలను గణనీయంగా అదుపులోకి తీసుకు రాగలిగామని చెప్పారు హోం శాఖ మంత్రి. సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవాలని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!