శాన్ ఫ్రాన్సిస్కో : పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మల్లు అమెరికాలోని బే ఏరియా పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని ప్రముఖ ప్రవాస భారతీయులు, ఐటీ, వైద్య, మానవ వనరులు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు సాగుతోందన్నారు. హైదరాబాద్ ఇప్పటికే టెక్నాలజీ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాల్లో దేశంలో అగ్రగామి కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ కొత్త రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
తెలంగాణలో పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలన అందిస్తున్నామని, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందిన పారిశ్రామిక పర్యావరణం రాష్ట్ర ప్రత్యేకతలని పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో కలిసి భాగస్వాములై అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భట్టి విక్రమార్క ఆహ్వానించారు.యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అలాగే మూసీ నది పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు.
ఈ సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవాస భారతీయులు , ప్రభుత్వాల మధ్య బలమైన భాగస్వామ్యాలు ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ప్రవాసులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలపై ప్రవాస భారతీయులు, బే ఏరియా ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. తెలంగాణతో అమెరికాలోని ప్రవాస భారతీయుల మధ్య సంస్థాగత సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఉపయోగపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, ఐఓసీ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
