శాఖ‌ల కేటాయింపులో సీఎందే అంతిమ నిర్ణ‌యం : ఖ‌ర్గే

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హోం శాఖ‌ మంత్రి

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా కొలువు తీరిన కేబినెట్ విస్త‌ర‌ణ‌పై కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉండ‌డంతో కొంద‌రు ఎమ్మెల్యేలు బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం, రాజీనామా చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. ఈ త‌రుణంలో సిద్ద‌రామ‌య్య కేబినెట్ లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖ‌ర్గే ఇప్పుడు కీల‌క‌మైన హోం శాఖ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆయ‌న సీఎం డీకే శివ‌కుమార్ కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికారు. కేబినెట్ లో కూర్పు, శాఖ‌ల కేటాయింపుపై హైక‌మాండ్ జోక్యం చేసుకోద‌న్నారు. విశిష్ట‌మైన అధికారాలు సీఎంకు అప్ప‌గించింద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు సాగుతున్న తరుణంలో ఈ ప్రక్రియపై ఎలాంటి గందరగోళం లేదని ఆయన పేర్కొన్నారు. శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గంలో తమకు చోటు దక్కలేదని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసేలా ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనే దానిపై పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. సుమారు 140 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేవలం 33 మంత్రి పదవులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సామాజిక న్యాయం , ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని పాటిస్తూ అందరినీ సంతృప్తి పరచడం కష్టమని మంత్రి పేర్కొన్నారు.

అయినప్పటికీ రాజీనామా చేసి పార్టీ కోసం పని చేయాలని అధిష్టానం భావిస్తే, అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేన‌ని నొక్కి చెప్పారు ప్రియాంక్ ఖ‌ర్గే. నేను కూడా దానికి కట్టుబడి ఉంటాను. అధిష్టానం తీసుకునే నిర్ణయం నుండి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని ఖర్గే చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!