ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్ర‌బాబు

కేంద్ర మంత్రులకు వేర్వేరుగా సీఎం లేఖలు

అమరావతి : జన్యు పరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీ దారులకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు లేఖ రాశారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో, మేత తయారీ ఖర్చులు పెరిగాయని వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సీఎం స్పష్టం చేశారు. దేశంలో రొయ్యల మేత కొరతను తీర్చేందుకు, ధరల నియంత్రణకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు. 2021లోనూ రొయ్యల మేత తయారీదారులకు పరిమిత స్థాయిలో దిగుమతి చేసుకునేందుకు అనుమతులిచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఈక్వెడార్ నుంచి పెరిగిన రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో దేశీయ ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు సీఎం.

అమెరికా, చైనా , యూరోప్ లాంటి ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కుంటున్నాయని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తన లేఖలో వివరించారు. జన్యుమార్పిడి చేసిన సోయాబీన్‌ను వ్యవసాయానికి, విత్తన ఉత్పత్తికి వినియోగించే అవకాశం లేదని తద్వారా జీవ వైవిధ్యానికి దేశీయ వంగడాలకు ముప్పు లేదని సీఎం వివరించారు. ప్రభుత్వం సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇస్తే రొయ్యల మేత పరిశ్రమకు నాణ్యమైన ముడి సరుకు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు. లక్షలాది మంది రొయ్యల రైతులు, కార్మికులకు ఉపాధి కలుగుతుందని, తద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు .

Leave A Reply

Your Email Id will not be published!