అమరావతి : ఏపీ నుంచి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. లక్షలాది మంది రైతు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు దోహద పడుతోందని సీఎం వెల్లడించారు. దేశంలోని పొగాకు ఉత్పత్తిలో ఎఫ్‌సీవీ పొగాకు 70 శాతం మేర ఎగుమతి అవుతోందని సీఎం వెల్లడించారు. జింబాబ్వే, టాంజానియా లాంటి దేశాల్లోని ఎగుమతి దారులకు ఆయా దేశాలు రాయితీలు, సుంకాల మినహాయింపు ఇస్తున్నాయని తెలిపారు. భారతీయ పొగాకు ఎగుమతిదారులకు ఎలాంటి మద్దతు లేకపోవటంతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 2021లో రోడ్‌టెప్ పథకం కింద టీ, కాఫీ, మసాలా దినుసులు లాంటి వ్యవసాయ వస్తువులను చేర్చినప్పటికీ… ప్రాసెస్ చేయని పొగాకును (HS Code 2401) మాత్రం ఈ జాబితాలో చేర్చలేదన్నారు నారా చంద్రబాబు నాయుడు.
సమాన వడ్డీ పథకం, నిర్యాత్ ప్రోత్సాహన్ లాంటి పథకాల కింద ఎఫ్‌సీవీ పొగాకుకు సబ్సిడీ లేకపోవటంతో ఎగుమతిదారులకు భారం పడుతోందని సీఎం వివరించారు. తక్షణమే ప్రాసెస్ చేయని పొగాకు (HS Code 2401-2401 10, 2401 20,2401 30) రకాలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పాటు RoDTEP పథకం కింద ప్రయోజనాలు వర్తింపజేయాలని సీఎం కోరారు. ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకునేలా ఆక్వా కల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం భారత- అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఆక్వా దిగుమతులపై సుంకం 10 శాతానికి తగ్గినా ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతోందని టారిఫ్ సంక్షోభంపై కేంద్ర ఆర్ధిక శాఖ జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు.
