గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని కీలక ప్రకటన
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో గిరిజన ప్రజలు ఎటువంటి ఆందోళనకు, అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు. జీవో నెంబర్ 3 పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై గిరిజన ప్రజల ఆకాంక్షలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకు వచ్చాం. దీని ద్వారా షెడ్యూల్ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్లు దక్కేలా చూశాం. దాదాపు 20 ఏళ్లు అమల్లో ఉన్న ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. నాటి ప్రభుత్వం ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించక పోవడం వల్ల సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 22న కొట్టేసిందన్నారు.
దీంతో రెండు దశాబ్డాల పాటు గిరిజనులు పొందిన ప్రయోజనాలు కొనసాగించే వీలు లేకుండా పోయిందన్నారు. నాటి ప్రభుత్వం ఈ సమస్యపై కనీసం స్పందించ లేదని వాపోయారు సీఎం. జీవో నెంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సుప్రీంకోర్టు 5గురు సభ్యుల ధర్మాసనం స్పష్టమైన తీర్పు నేపథ్యంలో ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం అని అన్నారు. స్థానికులకే ఉద్యోగాలు అంశంతో పాటు గిరిజనులకు సంబంధించి పలు సమస్యలపై గిరిజన సంఘాలతో వెంటనే చర్చించాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయా అంశాలపై గిరిజన సంఘాలను ఆహ్వానించి,ఉన్నతాధికారులు, గిరిజన ప్రజా ప్రతినిధులు చర్చించాలని సూచించారు. జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా చేస్తున్న ప్రయత్నాలను వివరించడంతో పాటు…ఈ ప్రక్రియలో వారిని కూడా భాగస్వాములు చేయాలని సూచించారు.
