అమరావతి : భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆగస్టు 1 తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలను తెలుపుతూ థింసా, సవర, కొమ్ము కోయ తదితర సంప్రదాయ నృత్య రూపాలతో ఘన స్వాగతం పలకాలని తెలిపారు. ఆగస్టు 1 తేదీన విమానాశ్రయ పాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు… జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీతో పాటు జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీలను ప్రధాని మోదీ లాంఛనంగా ఆవిష్కరిస్తారని తెలిపారు.
ఉత్తరాంధ్ర మణి హారంగా నిలవనున్న ఈ విమానాశ్రయం లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక గేమ్ చేంజర్లా మారుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకమారు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభను నిర్వహించాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే వారి కోసం అల్పాహారం, భోజనం, తాగునీటి లాంటి సదుపాయాలు కల్పించాలన్నారు. రేపటి నుంచి జూలై 31 తేదీ వరకూ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. రానున్న పది రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రతి ఇంటా ఈ ప్రారంభోత్సవ వేడుక స్పూర్తి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
