వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
శ్రీవారి మెట్టు సమీపంలో భక్తిశ్రద్ధలతో అన్న ప్రసాదాల పంపిణీ
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర స్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారిమెట్టు సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి ఉత్సవ మూర్తులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ క్షేమతలిగ నివేదన అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. దుష్ట శిక్షణకు ప్రతీకగా స్వామి వారు మూడుసార్లు బళ్లెంను ప్రయోగించే విశిష్ట ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆస్థానం నిర్వహించారు. తరువాత సాయంత్రం ఉత్సవ మూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా పార్వేట ఉత్సవం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భజన బృందాలు భజనలు, కోలాటాలతో భక్తులను అలరించగా, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ.శరత్, ఆలయ ప్రత్యేక అధికారి ఈవో వరలక్ష్మీ, ఏఈవో గోపినాధ్, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ జయ, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.
