Medaram Jatara: ఘనంగా ప్రారంభమైన మేడారం జాతర ప్రత్యేక పూజలు !
ఘనంగా ప్రారంభమైన మేడారం జాతర ప్రత్యేక పూజలు !
Medaram Jatara: తెలంగాణా కుంభమేళాగా ప్రశిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారక్క జాతర ప్రత్యేక పూజలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో మండమెలిగే పండగతో పూజారులు ఈ జాతరను ప్రారంభించారు. ఈ నెల 21 నుండి ప్రారంభం కాబోయే మేడారం జాతర… గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం బుధవారంతో ప్రారంభంఅయినట్లు చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం నుండే మేడారం(Medaram) వనం భక్తులతో కిక్కిరిపోతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం…. మండమెలిగే పండుగ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలు (చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించడానికి పూజారులు అడవికి వెళ్లారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పనిచేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు. ఈ నెల 21 నుండి మేడారం మహా జాతర ప్రారంభం కానుంది.
Medaram Jatara Updates
దేశంలో అతి పెద్ద గిరిజన జాతరగా, భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధిక మంది భక్తులు పాల్గొనే జాతరగా మేడారం సమ్మక్క-సారక్క జాతర ప్రశిద్ధి చెందింది. తెలంగాణా రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram) అనే గిరిజన గ్రామంలో రెండేళ్ళకొకసారి నిర్వహించే ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. జంపన్నవాగులో స్నానం, సమ్మక్క, సారక్క దర్శనం, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడంతో కోరిన కోరికలు తప్పక తీరుతుందని భక్తులకు నమ్మకం. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు మేడారం జాతరలో పాల్గొంటారు. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాలను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో మేడారం మహాజాతరకు తెలంగాణా ప్రభుత్వం పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత మొదటిసారి జరుగుతున్న మేడారం జాతరకు ప్రభుత్వం పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, రవాణా, భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తుంది. స్వచ్ఛంద సంస్థలు, దేవాదయ శాఖ సహాకారంతో ఎక్కడికక్కడ ఉచిత భోజనం, ప్రసాదం, మజ్జిగ, మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేసింది. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
Also Read : Jayapradha: సినీనటి జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపుర్ కోర్టు ఆదేశాలు !