MI vs UPW WPL 2023 : చెలరేగిన ముంబై ఇండియన్స్.. ఫైనల్లో ఢిల్లీతో సై
MI vs UPW WPL 2023 : తొలిసారి జరుగుతోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 లో ముంబై ఇండియన్స్ ఫైనల్ కు చేరుకుంది. శుక్రవారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్(MI vs UPW WPL 2023) 72 పరుగుల తేడాతో యూపీ వారియర్జ్ పై ఘనవిజయం సాధించింది.
దాంతో ఫైనల్ కు అర్హత సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు 17.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. కిరణ్ నవ్ గిరె (27 బంతుల్లో 43 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు.
ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్ 4 వికెట్లతో మెరిసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. ఓపెనర్ శెరావత్ (1) రెండో ఓవర్ ఆఖరి బంతికి అవుటైంది. కాసేపటికే ఆశలు పెట్టుకున్న కెప్టెన్ అలీసా హీలీ (11) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటైంది.
తాలియా మెక్ గ్రాత్ (7), గ్రేస్ హ్యారీస్ (14) అలా వచ్చి ఇలా వెళ్లారు. అయితే మరో ఎండ్ లో మాత్రం కిరణ్ ధాటిగా ఆడింది. దాంతో యూపీ శిబిరంలో ఎక్కడో గెలుపుపై ఆశలు అలాగే ఉండిపోయాయి.
రిక్వైర్డ్ రన్ రేట్ 13కు పైగా ఉండటంతో భారీ షాట్ కు ప్రయత్నించిన కిరణ్ బౌండరీ లైన్ దగ్గర సీవర్ చేతికి చిక్కింది. కిరణ్ అవుటైన అనంతరం యూపీ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (39 బంతుల్లో 78 నాటౌట్ 9 ఫోర్లు, 3 సిక్సర్లు) యూపీ బౌలర్లపై చెలరేగిపోయింది.
ఆమెకు అమెలియా కెర్ (19 బంతుల్లో 29; 5 ఫోర్లు ) రూపంలో చక్కటి సహకారం అందింది. ఫలితంగా ముంబై భారీ స్కోరును అందుకుంది. యూపీ బౌలర్లలో నాట్ సీవర్ 2 వికెట్లు తీసింది. అంజలి శర్వాణి, చోప్రాలకు చెరో వికెట్ లభించింది.
ఈ దశలో జట్టు బాధ్యతను నాట్ సీవర్ తీసుకుంది. 6 పరుగుల వద్ద తాను ఇచ్చిన క్యాచ్ ను ఎకెల్ స్టోన్ జారవిడిచింది. దాంతో బతికిపోయిన సీవర్ రెచ్చిపోయి ఆడింది.
190 స్ట్రయిక్ రేట్ తో వేగంగా పరుగులు సాధించింది. అమీలా కెర్ తో కలిసి నాలుగో వికెట్ కు విలువైన పరుగులు జోడించింది. ఈ క్రమంలో సీవర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. చివర్లో కెర్ర్ అవుటైనా.. పూజా వస్త్రాకర్ ఆఖరి ఓవర్లో 4, 6 బాదింది.
ఇక ఆఖరి బంతిని సీవర్ భారీ సిక్సర్ బాదడంతో ముంబై ఇండియన్స్ స్కోరు 182 పరుగులకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది.
Also Read : పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం చేయాలి – రిక్కీ