Minister Hebbalkar : బీజేపీ సభ్యుడు సిటీ రవి మహిళ అనికూడా చూడకుండా అవమాన పరిచారు

పరిషత్‌లో జరిగిన ఘటనకు పోలీసుల జోక్యం చేసుకోరాదని పరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి మండిపడ్డారు...

Minister Hebbalkar : విధానపరిషత్‌లో బీజేపీ సభ్యుడు సీటీ రవి అనుచితమైన వ్యాఖ్యలతో అవమానం జరిగిందని మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌(Minister Hebbalkar) విచారం వ్యక్తం చేశారు. బెళగావిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళ అనే కనీస సానుభూతి లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని సీటీ రవిపై మండిపడ్డారు. రెండురోజులపాటు ఇంటినుంచి బయటకు రాలేదని కనిపించినవారందరికీ ఏమని చెప్పుకోవాలని, ఓ మహిళగా ఎంత కుమిలిపోయానో తనకే తెలుసన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నకిలీ ఎన్‌కౌంటర్‌ పదాలు వాడుతున్నారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు తనకు జరిగిన అవమానంపై లేఖలు రాస్తానన్నారు. అవకాశం లభిస్తే రాష్ట్రపతి, ప్రధానిని భేటీ అవుతానని, పరిషత్‌ నిండుసభలో జరిగిన అవమానాన్ని వివరిస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీకి సిద్ధంగా లేనని, న్యాయపోరాటం చేస్తానన్నారు. కాగా సీటీ రవి వ్యాఖ్యానించినట్లుగా ఉండే ఆడియోను మంత్రి విడుదల చేశారు.

Minister Hebbalkar Comment

పరిషత్‌లో జరిగిన ఘటనకు పోలీసుల జోక్యం చేసుకోరాదని పరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి మండిపడ్డారు. సోమవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌(Minister Hebbalkar), సీటీ రవిల వివాదం ముగిసిన అధ్యాయమన్నారు. 19వ తేదీనే సభలో రూలింగ్‌ చేశానని, సభను నిరవధికంగా వాయిదా వేశామన్నారు. సభలో జరిగే సంఘటనలపై పోలీసులు జోక్యం చేసుకోరాదన్నారు. పంచనామా చేసేందుకు పోలీసులు కోరారని, తాను అనుమతులు ఇవ్వలేదన్నారు. పరిషత్‌ తలుపులు వేశామని, పంచనామా చేసేందుకు వీలుండదన్నారు.

బయటఅంశాలపై తాను జోక్యం చేసుకోనన్నారు. సభ జరిగే సమయంలో ఎటువంటి వివాదం లేదని కలాపాలు ముగిశాక జరిగే వివాదంలో తమకు సంబంధం లేదన్నారు. సీటీ రవి అరెస్టుతో తమకు నేరుగా సంబంధం లేదన్నారు. ఆడియో రికార్డు కాలేదని, సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయన్నారు. రికార్డులు పరిశీలించామని, ఆడియోలో ఎటువంటి విషయాలు లభించలేదన్నారు. ఇద్దరి నుంచి ఫిర్యాదు తీసుకున్నానన్నారు. ఆరోజు రాత్రి ఒంటి గంట వరకు సీటీ రవితో మాట్లాడానన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌తో చర్చించానన్నారు. పరిషత్‌ ప్రాంగణలో సభ్యుడు సీటీ రవిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, కమిషనర్‌లకు సూచించానన్నారు.

పరిషత్‌ ప్రాంగణంలో సభ్యుడు సీటీ రవిపై దాడికి పాల్పడిన సంఘటనకు హిరేబాగేవాడి పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈమేరకు వీడియోలు, ఫొటోల ఆధారంగా వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే సీటీ రవిపై అదే రోజు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు పరిపాలనా కేంద్రం సువర్ణసౌధలో సీటీ రవిపై దాడి సంబంధించి కేసు నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి స్పందిస్తూ బెళగావి పోలీస్‌ కమిషనర్‌ హోదాకు అనర్హుడని మండిపడ్డారు. కాగా తన ఫిర్యాదుకు అనుగుణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుంటే చలో బెళగావి యాత్ర చేస్తానని సీటీ రవి తెలిపారు.

Also Read : AP High Court : మాజీ మంత్రి పిటిషన్ విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!