Minister Kinjarapu Atchannaidu: ఎరువులపై రైతులు ఆందోళన చెందవద్దు – మంత్రి అచ్చెన్నాయుడు

ఎరువులపై రైతులు ఆందోళన చెందవద్దు - మంత్రి అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu : రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని… ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు.

Minister Kinjarapu Atchannaidu Key Updates onn Fertilizers

‘‘ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంది. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. కేంద్రం ఇప్పటి వరకు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా… 1.30 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరాయి. 0.47 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయి. ఆగస్టు నెలలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చింది. మిగిలిన 0.90 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒడిశాలోని పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయి. రైతులకు ఎరువులు పారదర్శకంగా, సమయానికి అందించేందుకు ఇంటిగ్రేటెడ్‌ ఫెర్టిలైజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(IFMS) ద్వారా పర్యవేక్షిస్తున్నాం. మధ్యవర్తులు అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. నల్లబియ్యం, అరటి, చెరకు వంటి ప్రత్యేక పంటలకు ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుగుతోంది’’అని మంత్రి అచ్చెన్న వివరించారు.

ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా ఏపీకి 10,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఒడిశా ధమ్రా పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏపీలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యూరియాను యుద్ధప్రాతిపదికన పంపాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అదేవిధంగా గంగవరం పోర్ట్‌ కి సెప్టెంబర్ 6వ తేదీన 15,000 మెట్రిక్ టన్నుల యూరియా, సెప్టెంబర్ రెండో వారంలో కాకినాడ పోర్ట్‌కి 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని కేంద్రం హామీ ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఖరీఫ్ సీజన్‌కి యూరియా పుష్కలంగా లభిస్తోందని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎరువులు పారదర్శకంగా, సమయానికి అందించేందుకు IFMS (Integrated Fertilizer Management System) ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

యూరియా కొరతపై మంత్రి పయ్యావుల ఫైర్

మరోవైపు.. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌ లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్ మంత్రి భరత్, మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, గుమ్మనూరు జయరామ్, అమిలీనేని సురేంద్ర బాబు, పరిటాల సునీత, తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో యూరియా కొరతపై ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ (Payyavula Keshav) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతేడాది కంటే ఈ సంవత్సరం ప్రభుత్వం అనంతపురం జిల్లాకు 5,000 టన్నులు ఎక్కువగా మంజూరు చేసిందని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ప్రతిపాదనలను ఎందుకు పంపించారని ఫైర్ అయ్యారు. సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు యూరియా కొరత వస్తోందని నిలదీశారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూరియా పక్కదారి పట్టిందనే ఆరోపణల్లో వాస్తవం ఎంత అని ప్రశ్నించారు. సొసైటీల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.

Also Read : Free Electricity: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

Leave A Reply

Your Email Id will not be published!