Minister Kishan Reddy : మూసి రిటర్నింగ్ వాల్ నిర్మాణంకై సీఎం రేవంత్ పై భగ్గుమన్న కేంద్ర మంత్రి
ప్రజలు బలహీనులు కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు...
Kishan Reddy : మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదోళ్ల ఇళ్లు కూల్చడాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఖండించారు. వారికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడి చిన్నచిన్న స్థలాలు కొనుక్కున్నారని, వారికి ప్రభుత్వమే అన్నీ అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూలుస్తామని చెప్పడం దారుణమని ఆయన అన్నారు. కూల్చివేతలు అంత ఈజీ కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా మూసీ ప్రాంతంలో పర్యటించి ప్రజలను ఒప్పించాలని డిమాండ్ చేశారు.
Kishan Reddy Slams
మూసీ రిటర్నింగ్ వాల్ నిర్మించి కూడా సుందరీకరణ చేయెచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. అన్నీ డ్రైనేజీలు మూసీలోనే కలుస్తున్నాయని, కనీసం శుద్ధి జరగకుండా నేరుగా నదిలోనే ముగురునీరు కలుస్తోందని ఆయన చెప్పారు. గంగా నదిపై కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో శుద్ధి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మూసీ సుందరీకరణకు రూ.1.50లక్షల కోట్లు అవసరం లేదని స్పష్టం చేశారు. రేస్ కోర్స్ స్థలం అమ్మేసి మరీ సుందరీకరణ చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్లాన్ లేకుండా ఇళ్లు కూల్చివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎం దుందుడుకుగా వ్యవహరిస్తానంటే కుదరదని కేంద మంత్రి హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజలపై బెదిరింపులకు పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు గవర్నర్ చట్టబద్ధత కల్పించడం సాధారణ ప్రక్రియ అని, బాధితులు ఎవరూ భయపడొద్దని చెప్పారు. మూసీ బాధితుల కోసం బీజేపీ పోరాటం చేస్తోందని ఆయన మరోసారి చెప్పుకొచ్చారు.
ప్రజలు బలహీనులు కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. హైడ్రా అంటే భూతం కాదని, గతంలోనూ అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేదని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం దాని పేరును మార్చారని, అదే హైడ్రా అని చెప్పారు. హైడ్రా ముందుగా మూసీ నదిలో ఉన్న బస్ డిపో, మెట్రో పిల్లర్స్‌ను కూల్చాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. వాటిని కూల్చకుండా ముందుగా పేదవారి ఇళ్లు ఎలా పడకొడతారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి రావాలని డిమాండ్ చేశారు. మూసీలో కలిసే మురుగునీరు ఏం చేస్తారో ముందు సమాధానం చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల మురుగునీరు వచ్చి మూసీలోనే కలుస్తోందని తెలిపారు. దీనిపై సీఎం ముందుగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు తనను సంప్రదించారని వస్తున్న వార్తలను కిషన్ రెడ్డి(Kishan Reddy) ఖండించారు. తనను ఇప్పటివరకూ ఎవరూ సంప్రదించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 98శాతం హిందువుల ఓట్లు తమకే వచ్చాయని కిషన్ రెడ్డి చెప్పారు. కశ్మిరీ పండిట్లు మెుత్తం తమకే ఓట్లు వేశారని చెప్పారు. ఆర్టికల్ 370రద్దు ఓ చరిత్ర అని, దాన్ని తిరిగి తీసికొని వచ్చే అవకాశమే లేదన్నారు. చిన్న ఘటనా చోటు చేసుకోకుండా 60 శాతం ఓటింగ్ జరిగిందని ఆయన చెప్పారు. ఫేక్ నోట్లు నియంత్రించామని, టెర్రరిజాన్ని అరికట్టగలిగామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఐఎస్ఐపై కఠిన చర్యల కారణంగానే ఇదంతా జరిగిందని కేంద్ర మంత్రి చెప్పారు. జార్ఖండ్‌లో జరిగే ఎన్నికల్లోనూ తామే గెలవబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని, చైనా ఆహారం, ఆయుధాలు పాకిస్థాన్‌కు ఇస్తోందని మండిపడ్డారు. కాశ్మీర్‌లో పాక్ ఆటలు ఇకపై సాగనివ్వమని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
Also Read : Telangana Congress : నాగార్జున, మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించిన ‘టీపీసీసీ చీఫ్’