Minister Komatireddy : మహాకుంభ లో స్నానం ఆచరించిన తెలంగాణ మంత్రి
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు..
Minister Komatireddy : ప్రయాగరాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా వేలాదిగా పాల్గొంటున్నారు. కాగా, మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Minister Komatireddy Visit..
మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పుణ్యస్నానం చేశారు. వీరేకాక సినీనటులు హేమామాలిని, అనుపమ్ ఖేర్, ఒలింపిక్స్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్, కొరియోగ్రాఫర్ రెమె డిసౌజా తదితర ప్రముఖులు కూడా పుణ్యస్నానం గావించారు.
తాజాగా ఈ పవిత్ర కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy) పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడి ఘాట్‌లలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల 10 నిమిషాలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో మంత్రి పుణ్యస్నానం గావించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు మంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి పూజారులు ఆశీర్వదించారు.
Also Read : Minister Kishan Reddy : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే