Minister Konda Surekha : వరంగల్ రాష్ట్రానికి 2వ రాజధానిగా అభివృద్ధి చేసి చూపిస్తాం

వరంగల్‌ అభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వంలో మాటలే విన్నామని....

Konda Surekha : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ఇవాళ(మంగళవారం) వరంగల్ నగరంలో జరగనుంది. విజయోత్సవ సభ కోసం వరంగల్ ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు. సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నారు. కాగా ప్లెక్సీలు, కటౌట్లతో ఓరుగల్లు మూడు రంగులమయమైంది.

Minister Konda Surekha Comments

వరంగల్‌ అభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వంలో మాటలే విన్నామని.. ఇప్పుడు తమ ప్రభుత్వం చేతల్లో చేసి చూపుతుందని.. మాది చేతల ప్రభుత్వమని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఉద్ఘాటించారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో ఉన్నారని చెప్పారు. అందుకే వరంగల్‌కు 4వేల పైచిలుకు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ విజయోత్సవ సభా ప్రాంగణంలో కొండా సురేఖ(Konda Surekha) ఏబీఎన్‌తో మాట్లాడారు. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో మాటలతో బీఆర్ఎస్ గడిపిందని మండిపడ్డారు. ఇప్పుడు నిధుల వరదపారుతోందని చెప్పారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్ కృషి చేస్తోందని అన్నారు. అందుకే ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ పేర్కొన్నారు.

వరంగల్‌ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హయగ్రీవచారి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3 గంటలకు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట రూ.92 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. కవులు, కళాకారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మ.3.20గంటలకు ఆర్ట్స్‌ కాలేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటల వరకు ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, ఎస్‌హెచ్‌జీ, ఎంఎస్‌, జడ్‌ఎస్‌ మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు విజయోత్సవ సభ వేదికపైకి చేరుకుంటారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించనున్న 22 మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో పది జిల్లాలో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌నూ ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు., అనంతరం విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Also Read : Deputy CM Pawan : ఏపీ డిప్యూటీ సీఎం కి ఉరటనిచ్చిన గుంటూరు కోర్టు

Leave A Reply

Your Email Id will not be published!