KTR : ధ్వంసం చేయడం కాంగ్రెస్ విధానమా
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
KTR : అసెంబ్లీ సాక్షిగా ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రద్దు చేయడం, ధ్వంసం చేయడం మీ పార్టీ విధానమా అని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ధరణిని రద్దు చేస్తానని చెప్పడం, ప్రగతి భవన్ ను బాంబులతో , గ్రెనేడ్లతో పేల్చి వేస్తామని చెప్పడం ఏ రాజకీయని నిలదీశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను తప్పు పట్టారు. తీవ్రంగా ఖండించారు కేటీఆర్.
ధరణి వల్ల ఎవరూ బాధపడడం లేదన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులే లోలోపల కుమిలి పోతున్నారని మండిపడ్డారు. గత ఆరు సంవత్సరాలలో 30 లక్షల రిజిస్ట్రేషన్లు అయితే ఒక్క ఏడాదిన్నర కాలంలో 23 లక్షల 92 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని..ఇది ధరణి సాధించిన విజయమని స్పష్టం చేశారు కేటీఆర్(KTR).
కాంగ్రెస్ పార్టీ హయాంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే లంచం ఇవ్వనిదే ఏ పని కాలేదన్నారు మంత్రి. రైతులను ఇబ్బంది పెట్టిన ఘనత మీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవిన్యూ వ్యవస్థలో అవినీతి అన్నది లేకుండా చేశామని చెప్పారు. ఇందులో ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పాలన్నారు కేటీఆర్.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు మంత్రి. టీపీసీసీ చీఫ్ ధరణిని రద్దు చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించాడని కానీ పార్టీ మాత్రం అలా అనలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు నాల్కల ధోరణి మంచి పద్దతి కాదన్నారు.
Also Read : ప్రగతి భవన్ కూల్చేస్తే శని పోతుంది